వీఐపీల భద్రత తొలగించిన సీఎం.. అందరూ అభినందిస్తున్నారు

Sun May 29 2022 11:03:52 GMT+0530 (IST)

Punjab Cm Removes Secirity To Vips

రోటీన్ కు భిన్నమైన నిర్ణయాలతో పాలనా రథాన్ని పరుగులు తీయించే అధినేతలు అప్పుడప్పుడు అధికారంలోకి వస్తారు. మిగిలిన వారితో ఏ మాత్రం పోలిక లేకుండా వారి పాలన సాగుతుంటుంది. అలాంటి క్రెడిట్ ను సొంతం చేసుకున్నారు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంచలన నిర్ణయాల్ని తీసుకుంటూ.. పంజాబ్ ప్రజలకు సరికొత్త అనుభూతిని కలుగచేస్తున్నారు.ఈ మధ్యనే అవినీతి ఆరోపణలు వచ్చినంతనే తన క్యాబినెట్ లోని మంత్రిపై వేటు వేయటమే కాదు.. ఏకంగా జైల్లో కూర్చోబెట్టిన ఆయన.. తర తమ బేధం లేకుండా కొత్త తరహా పాలనను అందిస్తూ.. పంజాబ్ ప్రజల తీర్పుతో రాష్ట్రానికి మంచి జరిగిందన్న భావన వ్యక్తమయ్యేలా చేస్తున్నారు.

తాజాగా ఆయన వీవీఐపీలకు.. వీఐపీలకుకల్పిస్తున్న భద్రతను పున:సమీక్షించటమే కాదు.. పెద్దఎత్తున వారికి ఇస్తున్న భద్రతను తొలగిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నంతనే రాజకీయ రగడగా మారటం.. ప్రభుత్వం ఆత్మరక్షణలోకి పడటం జరుగుతుంది. అందుకు భిన్నంగా మాన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.

తమ ప్రభుత్వం వీఐపీ కల్చర్ కు దూరమని.. సాధారణ ప్రజలకు పెద్ద పీట వేస్తామని చెప్పిన మాటలకు తగ్గట్లే తాజా నిర్ణయాలు ఉండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రాజకీయ నేతలు.. మత పెద్దలు.. రిటైర్ అయిన పోలీసు అధికారులు.. ఇలా వివిధ వర్గాలకు చెందిన 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను తాజాగా ఊపసంహరించుకన్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు.. డేరా రాధ సోమీ బ్యాస్ కు ఉన్న 10 మంది సెక్యూరిటీని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. నెల ముందు అంటే ఏప్రిల్ లో 184 మంది మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా తాజా నిర్ణయం ఉందని చెబుతున్నారు.

తాజాగా సెక్యూరిటీ ఉపసంహరించుకోవటంతో మాజీ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీతో పాటు.. మాజీ మంత్రులు.. మంచి పట్టున్న నేతలుగా పేరున్న మన్ ప్రీత్ సింగ్బాదల్.. రాజ్ కుమార్ వెర్కా.. భరత్ భూషణ్ అషు లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.   ముఖ్యమంత్రి నిర్ణయంతో 400 మంది పోలీసులు స్టేషన్లకు వచ్చి ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలే కానీ.. వీఐపీల సెక్యురిటీ పేరుతో వారి కోసం పని చేసి ప్రజలను బాధ పెట్టకూడదన్నదే తమ ప్రభుత్వ విధానంగా చెబుతున్నారు. ఇంతకాలం వీఐపీలకు సేవలు అందించే ప్రభుత్వాలతో విసిగిపోయిన పంజాబ్ ప్రజలకు.. మాన్ సర్కారు నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇలాంటి మార్పు దేశం మొత్తమ్మీదా రావాల్సిన అవసరం ఉంది.