పంజాబ్ సీఎంకు భారీ ఊరట.. ఓకే చెప్పిన గవర్నర్

Sun Sep 25 2022 17:38:26 GMT+0530 (India Standard Time)

Punjab CM Bhagwant Singh Mann

ఇటీవల ఫుల్లుగా తాగేసి విమానం ఎక్కితే సిబ్బంది గెంటేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కు తాజాగా భారీ ఊరట లభించింది.  అసెంబ్లీలో ఆయన బల నిరూపణకు అంగీకారం వచ్చింది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని భావిస్తున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కు ఊరట లభించింది.అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి చివరి క్షణంలో నిరాకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చాడు పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్. తాజాగా ఎట్టకేలకు అసెంబ్లీ మీటింగ్ లకు అంగీకరించాడు. ఈ నెల 27న మంగళవారం అసెంబ్లీ మూడో సెషన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ విశ్వాస పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అనేది స్పష్టంగా తెలియడం లేదని ఆప్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాలను రాష్ట్రంలోని పంట వ్యర్థాల కాల్చివేత విద్యుత్ రంగం సమస్యలపై చర్చించేందుకు ఉపయోగించుకుంటామని ఆప్ ప్రభుత్వం చెబుతోంది.

ఇక కేంద్రంలోని బీజేపీ పంజాబ్ పై ఫుల్ ఫోకస్ చేసింది. ఆపరేషన్ లోటస్ పేరుతో 'ఎమ్మెల్యేలను కొనుగోలు ' చేస్తోందన్న ఆరోపణలున్నాయి. అందుకే తమ బల నిరూపణ చేసుకునేందుకు ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 22న విశ్వాస పరీక్ష నిర్వహించాలని సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు.

అయితే చివరిక్షణంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిరాకరించి ఆప్ ప్రభుత్వానికి గవర్నర్ భన్వారిలాల్ షాకిచ్చాడు. దీంతో గవర్నర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని దుయ్యబట్టారు.