దేశమంతా కీర్తిస్తుంటే.. ఆ ఎంపీ మాత్రం తిట్టిపోశాడే..!

Thu Dec 05 2019 15:21:54 GMT+0530 (IST)

Pull up people responsible for failure of Chandrayaan-2 Says MP Saugata Roy

విజయానికి అపజయమే తొలి మెట్టుగా చెబుతారు. ప్రయత్న లోపం లేకుంటే చాలు.. ఫలితం ఎలా వచ్చినా ఫర్లేదన్న నానుడిని పూర్తిగా మర్చిపోవటమే కాదు.. తన స్థాయికి ఏ మాత్రం తగని వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్. అతి తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులకు కారణమైన ఇస్రోను ఆయన తప్పు పట్టిన వైనం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 ఫెయిల్ కావటంపై మండిపడి అందరిని షాక్ కు గురి చేశారు. చంద్రుడి ఉపరితలంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ కూలిపోవటంతో దేశం అప్రతిష్టపాలైందని మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేయటం విస్తుపోయేలా చేస్తోంది.

ఈ తరహా విఫల ప్రయోగాల కోసం కేంద్రం అదనపు నిధుల్ని కేటాయించాల్సిన అవసరం లేదన్నారు. అంతరిక్ష రంగం కోసం మరిన్ని నిధులు కేటాయించటం వృథా  ప్రయాసగా అభివర్ణించారు. సౌగత్ రాయ్ వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష చరిత్రలో గొప్ప ప్రయోగంగా చంద్రయాన్ -2 గురించి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

సౌగత్ రాయ్ వ్యాఖ్యల్ని విన్నంతనే ఒక విషయం చప్పున గుర్తుకు రావటం ఖాయం. ఈ రోజున ప్రపంచంలోని ప్రతిఒక్కరూ వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ బల్బ్ ను కనుగొనేందుకు ఎడిసన్ 999 సార్లు విఫలం కావటం తెలిసిందే. వెయ్యి సారి ఆయన సక్సెస్ అయ్యారు. సౌగత్ రాయ్ లాంటోళ్లు ఎడిసిన్ కాలంలో పాలకుడై.. ఒక ప్రైవేటు వ్యక్తి తరచూ తన ప్రయోగాల్లో విఫలం కావటం దేశానికి అవమానం అంటే ఎలా ఉంటుంది? తమ సామర్థ్యానికి మించి ప్రయత్నించి విఫలమైనప్పుడు మరింత ప్రోత్సహించాల్సింది పోయి.. ఇలాంటి వ్యాఖ్యలు ఇస్రో శాస్త్రవేత్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయన్నది మర్చిపోకూడదు.