Begin typing your search above and press return to search.

ప్రొఫెసర్ నాగేశ్వర్ లెక్క... జగన్ కే ఛాన్సుందట

By:  Tupaki Desk   |   20 May 2019 1:35 PM GMT
ప్రొఫెసర్ నాగేశ్వర్ లెక్క... జగన్ కే ఛాన్సుందట
X
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నిన్నటితో ముగిసిపోయింది. ఏపీ అసెంబ్లీకి తొలి విడతలోనే అంటే... గత నెల 11ననే పోలింగ్ ముగియగా... సార్వత్రిక తుది పోలింగ్ నిన్న ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిన్న ఒక్కుమ్మడిగా విడుదలైపోయాయి. కేంద్రంలో మరోమారు అధికారం బీజేపీదేనని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే ఏపీ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి రెండు భిన్న వాదనలు వినిపించాయి. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటి వారు టీడీపీదే అధికారం అని చెప్పగా... మెజారిటీ సర్వేలు మాత్రం జగన్ ఈ సారి సీఎం కావడం ఖాయమని తేల్చేశాయి. అంతేకాకుండా జగన్ నేతృత్వంలోని వైసీపీకి 130కి పైగా సీట్లు వస్తాయని, తిరుగులేని మెజారిటీతో జగన్ సీఎం అవుతారని చెప్పాయి.

ఈ లెక్కలతో కాస్త గందరగోళమే నెలకొన్నా... ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓ విశ్లేషణతో ఆ గందరగోళం కాస్త సద్దుమణగక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ విశ్లేషణ ఎవరు చెప్పారన్న విషయానికి వస్తే... ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా లేని, రాజనీతి శాస్త్రంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ విశ్లేషణను విడుదల చేశారు. ఈ విశ్లేషణ ప్రకారం ఈ ఎన్నికల్లో వైసీపీకి 98 నుంచి 102 సీట్లు వస్తాయని నాగేశ్వర్ అంచనా వేశారు. అందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు. గడచిన సారి అనుభవానికి ఓటేయాలని భావించిన ఏపీ ప్రజలు చంద్రబాబుకు పాలనా పగ్గాలు అప్పగించారని, అయితే ఈ సారి మాత్రం జగన్ నోట నుంచి పదే పదే వినిపించిన ‘ఒక్క ఛాన్స్‘ బాగా పనిచేసిందని ఆయన చెప్పారు. వైసీపీకి వచ్చే స్థాయిలో సీట్లను సాధించే అవకాశాలు టీడీపీకి ఏ కోశానా లేవని కూడా ఆయన విశ్లేషించారు.

జనంలో చంద్రబాబు పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ... జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామన్న భావన... ఓటింగ్ సరళిగా భారీగా ప్రభావితం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అసెంబ్లీలో జగన్ కే ఓటరు ఫేవర్ గా కనిపిస్తే... లోక్ సభ ఎన్నికల్లోనూ జగన్ పార్టీకే జనం మొగ్గారని కూడా ఆయన చెప్పారు. జగన్ పార్టీకి ఈ దఫా ఏకంగా 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని నాగేశ్వర్ విశ్లేషించారు. ఇక ఈ ఎన్నికల్లో విజయాన్ని ప్రభావితం చేయడంలో కీలక భూమిక పోషించిందని భావిస్తున్న జనసేన... పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని ఈ పార్టీకి అసెంబ్లీలో 3 నుంచి 5 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని నాగేశ్వర్ తన అంచనాను చెప్పారు.