Begin typing your search above and press return to search.

ప్రియాంక మంతనాలు .. మెత్తబడ్డ సచిన్‌ పైలట్‌ !

By:  Tupaki Desk   |   13 July 2020 5:02 PM GMT
ప్రియాంక మంతనాలు .. మెత్తబడ్డ సచిన్‌ పైలట్‌ !
X
రాజస్తాన్‌ రాజకీయాలు గంటకో మలుపులు తిరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్ తిరుగుబాటు జెండా ఎగరవేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ‌తో‌ విబేధాల నేపథ్యంలో సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి , బీజేపీలో చేరతారనే వార్తలు వినిపించాయి. తనతో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, గహ్లోత్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న సచిన్ పైలట్‌ కీలక వ్యాఖ్యలు చేసిన అతి కొద్దీ సమయంలో అధిష్టానం మంతనాలు జరపడంతో కొంచెం మెత్తబడ్డాడు.

ఈ విషయాన్ని పరిష్కరించడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి గహ్లోత్‌, పైలట్‌ కు రాజీ కుదిర్చారు. దీంతో పైలట్‌ పలు డిమాండ్లను పార్టీ ముందుంచారు. పార్టీ చీఫ్‌ గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులతో పాటు కీలక ఆర్థిక, హోంశాఖలను కట్టబెట్టాలని కోరారు. ఈ డిమాండ్స్ పై పార్టీ నేతలు ఇరు వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇక అంతకుముందు, తన ప్రభుత్వం మైనారిటీలో పడలేదని, తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం గహ్లోత్‌ స్పష్టం చేయడంతో మరింత ఉత్కంఠత ఏర్పడింది. మరోవైపు రాజస్థాన్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు. ఇక 200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్ ‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్ ‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే , గంటకొక విధంగా రాజకీయం మలుపు తిరుగుతుండటం తో సీఎల్పీ భేటీపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.