Begin typing your search above and press return to search.

గాంధీ ఫ్యామిలీ మరో లోకేశ్ ను తయారు చేస్తుందా?

By:  Tupaki Desk   |   16 Feb 2020 2:30 PM GMT
గాంధీ ఫ్యామిలీ మరో లోకేశ్ ను తయారు చేస్తుందా?
X
నేత ఎవరైనా సరే.. ప్రజల్లోనే పుట్టాలి. ప్రజల మధ్యే పెరగాలి. ప్రజల ఆశీస్సులతో అందలం ఎక్కాలి. అందుకు భిన్నంగా తయారయ్యే నేతలకు ఉండే ప్రజాదరణ పరిమితంగా ఉంటుంది. వారు అత్యున్నత స్థానాల్ని చేరుకున్నప్పటికీ ప్రజాదరణ విషయంలో వారికి ఉంటే పరిమితులు అన్నిఇన్ని కావు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గా చెప్పాలి. సోనియమ్మ రిమోట్ గా అభివర్ణించే ఆయన్ను.. వ్యక్తిగతంగా ఇప్పటికి ఏ ఒక్కరు తప్పు పట్టరు. పదేళ్లు ప్రధానిగా వ్యవహరించినా.. ఆయన కారణంగా యూపీఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టం కానీ కష్టం కానీ ఏమీ లేదని చెప్పాలి.

మన్మోహన్ లాంటి నేత కనుక ప్రజల మధ్య నుంచి వచ్చి ఉంటే.. భారతదేశ రాజకీయ ముఖచిత్రం మరోలా ఉండేదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు. ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో లోటుపాట్లు ఏమీ లేకున్నా.. ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే విషయంలో మాత్రం ఆయన ఎప్పుడూ పాస్ కాలేదు. అందుకే..ముఖ్యనేతలు ఎవరైనా.. రాజకీయ వారసుల విషయంలోనూ ప్రజల చేత ఎన్నుకునేలా ఎన్నికల బరిలోకి దింపి.. వారికున్న ప్రజాభిమానాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తారు.

దేశంలోని ఏ రాజకీయ వారసుడ్ని చూసినా.. అత్యధికులు ప్రత్యక్ష ఎన్నికల బరిలో గెలిచినోళ్లే రాణించారే తప్పించి.. పరోక్ష ఎన్నికలతో ఎన్నికై పదవులు చేపట్టిన వారి హవా అంతంతమాత్రమే. అందుకు ఉదాహరణగా టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ ను చెప్పాలి. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా ఎమ్మెల్సీగా ఎంపిక చేసి.. మంత్రి పదవిని చేపట్టినప్పటికీ ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పటికి కాంగ్రెస్ పార్టీ తాజాగా దిద్దుకోలేని తప్పును చేస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆ పార్టీ భావి నాయకురాలిగా అభివర్ణించే ప్రియాంకను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్ష ఎన్నికలతో రాజ్యసభకు పంపాలన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉందంటున్నారు. ఓపక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవి చూసిన తర్వాత.. ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సింది పోయి.. అందుకు భిన్నంగా త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రియాంకను పెద్దల సభకు ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి సారధిగా మారిన వేళ.. పరోక్ష పద్దతిలో పదవుల్ని చేపట్టిన వైనం విమర్శల్ని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ నేతల వాదన మరోలా ఉంది. ఎంపీ పదవులకు యువరక్తాన్ని నింపాలని.. అందులో భాగంగా యువ నేతల్ని ఎన్నిక చేసి రాజ్యసభకు పంపాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ పార్టీ సీనియర్ నేతల్ని రాజ్యసభకు పంపే సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ కొత్త రూట్లో పయనిస్తుందని చెబుతున్నారు. ఒక రకంగా చూస్తే ఈ పద్దతి పార్టీకి మేలు చేసే వీలున్నా.. ప్రియాంక లాంటి జనాకర్షక నేతను రాజ్యసభకు ఎంపిక చేయటం ద్వారా కీలక అస్త్రాన్ని ముందే ప్రయోగించినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో కాలమే బదులివ్వాలి.