Begin typing your search above and press return to search.

నాన్నమ్మలా ప్రియాంక మ్యాజిక్ చేస్తారా.. ?

By:  Tupaki Desk   |   14 Jan 2022 1:30 AM GMT
నాన్నమ్మలా ప్రియాంక మ్యాజిక్ చేస్తారా.. ?
X
కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయం. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా అది వారి తప్పే అవుతుంది. గాంధీ ఫ్యామిలీ లేకపోతే కాంగ్రెస్ లేదు అన్నది కూడా వాస్తవం. మిగిలిన నాయకులు అంతా ఐక్యంగా ఉండలేరు. అలా పార్టీని కలిపేది ఆ ఫ్యామిలీయే. ఇపుడు సోనియా గాంధీ వయోభారంతో ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీలే పార్టీకి దిక్కుగా కనిపిస్తున్నారు. దేశానికి గుండెకాయ లాంటి యూపీలో ఇపుడు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో తన ప్లేస్ ఏంటో కాంగ్రెస్ చూసుకుంటోంది. నిజానికి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి బాగా ఆశలు ఉండేవి. నాడు బలమైన ఎస్పీతో పొత్తు ఉంది. పైగా పీకే వ్యూహాలు కూడా ఉన్నాయి. అయినా సరే బీజేపీ 325 సీట్లను గెలిచేసి కాంగ్రెస్ కి సింగిల్ డిజిట్ కి తెచ్చేసింది. ఎస్పీ లాంటి పార్టీకే 50 సీట్ల లోపు వచ్చాయి అంటేనే ఆ ఎన్నికలు ఎంత ఏకపక్షంగా సాగాయో అర్ధమవుతుంది.

తాజా ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్ ని పక్కన పెట్టింది. దాంతో ప్రియాంకాగాంధీ పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకుని ఊరూ వాడా తిరిగుతున్నారు. ఆమె మొత్తం తానై నడిపిస్తున్నారు. ఆమె పేదల ఇళ్ళకు వెళ్లారు, సామన్యులతో కలిసి నడిచారు. అదే విధంగా మహళలను, యువతను లక్ష్యంగా చేసుకుని వారిని దగ్గర తీసుకున్నారు. వారికి ఎన్నో హామీలు ఇచ్చారు.

పెద్ద ఎత్తున మహిళలకు సీట్లు కాంగ్రెస్ తరఫున ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి తగినట్లుగా తాజాగా ప్రకటించిన 125 సీట్లలో మహిళలకు సగానికి సగం ఇచ్చేశారు. తాజాగా ఉన్నావో రేప్ బాధితురాలి తల్లి ఆశాసింగ్ ని యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. అప్పట్లో ఉన్నావో రేప్ దేశాన్ని ఎంతలా కుదిపేసిందో తెలిసందే. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో లో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో అసలు దోషి తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అలా బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేసిందన్న మాట.

అంతే కాదు, గోండు గిరిజనుల కోసం సోన్ భద్రలోని ఉంభా గ్రామంలో ఉన్న భూ సమస్యపై న్యాయపోరాటం చేస్తున్న రామ్ రాజ్ గోండ్ కూ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అలాగే ఇచ్చినట్టు తెలిపారు ఇలా యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వంలో బాధితులు అయి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న ఆశా వర్కర్ పూనమ్ పాండే తో పాటు, సీఏఏ వ్యతిరేక అల్లర్లలో జైలుపాలైన కాంగ్రెస్ నేత సదాఫ్ జాఫర్ కూ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

ఇలా మహిళలకు యువతకు పెద్ద పీట వేస్తూనే బీజేపీ బాధితులను కూడా ప్రియాంకా గాంధీ వ్యూహాత్మకంగానేఅ బరిలో నిలబెట్టారు. అయితే కాంగ్రెస్ కి గతం కంటే గ్రాఫ్ పెరిగినా కూడా గెలిచే అవకాశాలు అయితే లేవు. కానీ ప్రియాంక కష్టం మాత్రం అభినందించాల్సిందే. ఆమె తన నాన్నమ్మ ఇందిరా గాంధీ మాదిరిగా రూపంతో పాటు అలాగే ప్రసంగాలను కూడా చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

గతంలో కాంగ్రెస్ కి దళితులు, మైనారిటీలు, ఠాకూర్లు, బ్రాహ్మిన్స్ గట్టి మద్దతుగా ఉండేవారు. ఇపుడు చూస్తే దళితుల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నా అది దక్కడంలేదు. బ్రాహ్మణులు కూడా ఎస్పీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. మైనారిటీలు సైతం ఎస్పీ పక్షమే ఉన్నారు. దాంతో ప్రియాంక కాంగ్రెస్ ని పటిష్టం చేయాలనుకుంటున్నా కూడా వాస్తవ దృశ్యం మాత్రం భిన్నంగా ఉంది.

యూపీ ఫైటింగ్ మొత్తం ఎస్పీ బీజేపీల మధ్యనే కేంద్రీకృతమైంది. గతం కంటే కాంగ్రెస్ పుంజుకున్నా అది ఏ మాత్రం సీట్లు తెస్తుంది అన్నది తెలియడంలేదు. మొత్తానికి యూపీ నుంచే నరుక్కురావాలి అన్న ప్రియాంక ఉద్దేశ్యం మంచిది. పోరాటం కూడా బాగుంది. ఈసారి కాకపోయినా లోక్ సభ ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ కి ఇది కలసి వస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ కి సీట్లు ఓట్లూ పెరిగితే అది కచ్చితంగా ప్రియాంకా గాంధీ క్రెడిట్ గానే చూడాల్సి ఉంటుంది. ఇంకో మాట చెప్పాలి. యూపీ ఎన్నికలలో ఫైటర్ గా ఉన్న ప్రియాంక కాంగ్రెస్ కి మాత్రం ఆశాజ్యోతిని తానే అంటున్నారు. ఇక్కడ ఏ మాత్రం కాంగ్రెస్ కి ఊపిరి వచ్చినా ప్రియాంకా జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపించడం ఖాయం.