Begin typing your search above and press return to search.

మునుగోడులో ప్రియాంక ఎంట్రీ? త్వరలోనే అధికారిక ప్రకటన

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:14 AM GMT
మునుగోడులో ప్రియాంక ఎంట్రీ? త్వరలోనే అధికారిక ప్రకటన
X
తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కించిన మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం.. ఇప్పుడు అనూహ్య పరిణామాలకు తెర తీస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరేందుకు వీలుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు.. నాలుగు నెలల్లో ఎన్నిక జరిగే వీలున్నా.. ఆ లోపు సమాయుత్తం కావటానికి అన్ని పార్టీల వారు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. రాజగోపాల్ రెడ్డి కారణంగా జరుగుతున్న ఉప పోరులో.. బీజేపీ అభ్యర్థిగా ఆయనే ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదు.

మిగిలిన టీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు ఎవరన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్లను ఇచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఆయనపై సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటం.. దాన్ని చల్లార్చే ప్రయత్నాలు చేసినా.. అవేమీ వర్కువుట్ కాకపోగా.. ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. తన దూకుడు తగ్గించి.. ఇప్పుడు ప్రత్యామ్నాయాల మీద ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్ బిజీగా ఉంది.

ఇలాంటి వేళ.. ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంటున్నదన్న మాట వినిపిస్తోంది. మునుగోడును కాంగ్రెస్ ఎంత సీరియస్ గా తీసుకుంటుందన్న విషయాన్ని తెలియజేసేలా.. తాజా నిర్ణయం ఉందంటున్నారు. అధికారికంగా ప్రకటన రానప్పటికి.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ ఈ దిశగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు.న ఇంతకూ విషయం ఏమంటే.. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సంబంధించిన ప్రియాంక వాద్రాకు దక్షిణ భారత పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు.

మరో మూడు.. నాలుగు నెలల్లో ఉప ఎన్నిక జరిగే వేళలో.. పార్టీని ఒక తాటి మీదకు తేవటంతో పాటు.. క్యాడర్ లో ఉత్సాహాన్ని పొంగి పొర్లేలా చేయటం కోసం ప్రియాంకను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. తెలంగాణ.. కాంగ్రెస్ రాష్ట్రాల్లో పార్టీని స్వయంగా నడిపేందుకు వీలుగా ఆమెకు బాధ్యతలు అప్పజెబుతారని.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని చెబుతున్నారు.

ఈ పరిణామం ఖాయంగా జరుగుతుందని చెబుతున్నారు. కొద్ది నెలల్లో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వీలు ఉండటం.. తెలంగాణలో కూడా పార్టీ బలంగా ఉన్నా.. నేతల మధ్య సఖ్యత లేని కారణంగా జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రియాంక అస్త్రాన్ని పార్టీ సంధిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. మునుగోడు ఉప పోరు మరింతగా రాజుకునే అవకాశం ఉంది