సోనియా ఆశీస్సులతో బీజేపీలోకా.. ‘సర్వే’ అన్న నువ్వు సూపర్!

Sat Nov 21 2020 23:20:44 GMT+0530 (IST)

Private Survey On Ghmc Elections

రాజకీయాల్లో భక్తులు ఉంటారు. కానీ అపర వీర భక్తులు కొందరే ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ లో చూసుకుంటే అధినేత్రి సోనియాగాంధీని మాటకు ముందు ‘అమ్మ’.. మాట తర్వాత ‘అమ్మ’ అనేంతగా అప్యాయత చాటుకుంటారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ.హనుమంతరావు సర్వే సత్యానారాయణ లాంటి వాళ్లు. ఈ కాంగ్రెస్ కురువృద్ధులు ప్రాణం పోయినా కాంగ్రెస్ ను వీడరని అందరూ అనుకుంటారు. వీహెచ్ సంగతి పక్కనపెడితే సర్వే సత్యనారాయణ మాత్రం ట్రెండ్ మార్చేశారు. కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ట్విస్ట్ ఏంటంటే.. కాంగ్రెస్ వీడిపోతూ కూడా సోనియమ్మను బూచీగా చూపడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్లకు అంతా బీజేపీ గాళం వేస్తోంది. దుబ్బాక విజయంతో దిగ్గజ నాయకులు లేని బీజేపీ పక్క పార్టీల నేతలపై కన్నేసింది. పార్టీ బలోపేతం కోసం ఎవ్వరొచ్చినా కండువా కప్పేస్తున్నారు. ఈక్రమంలోనే పాత సీనియర్ నేతలను కాషాయ గూటికి చేర్చేందుకు ఓ బ్యాచ్ తిరుగుతోందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. 2024 ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు వలసలు ప్రోత్సహిస్తున్నారట..

ఈ క్రమంలోనే వైఎస్ఆర్ హయాంలో వెలుగువెలిగి కేంద్ర మంత్రిగా చక్రంతిప్పి ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. హా.. ప్రకటిస్తే ఏమయ్యిందనే కదా మీ డౌటు. ఇక్కడే సర్వే తన భక్తి ప్రవత్తులను కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మపై ప్రదర్శించడం విశేషం.

సర్వే సత్యానారాయణ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశీస్సులతోనే బీజేపీలోకి వెళ్తున్నానని’ బాంబు పేల్చారు. సోనియా తనకు తల్లిలాంటిందని.. రాహుల్ గాంధీ తనకు తమ్ముడు అని అన్నారు. సోనియాకు ఆరోగ్యం క్షీణించిందని.. రాహుల్ కు రాజకీయాలపై ఆసక్తి లేదని.. అందుకే తాను మరో దారి చూసుకుంటున్నాన్నారు. బీజేపీలోకి వెళ్లడానికి కూడా సోనియాను సర్వే వాడిన తీరు చూసి బీజేపీ నేతలు ముక్కున వేలేసుకున్నారట.. ఇక సోనియాను పొగిడిన సర్వే.. టీఆర్ఎస్ కోవర్టుల వల్లే కాంగ్రెస్ పతనమైందని పార్టీపై మాత్రం దుమ్మెత్తి పోయడం విశేషం.

సోనియా ఆశీస్సులు ఉంటే ఆమె తన ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీలోకి వెళ్లమని చెప్తుందా? సర్వే ఎందుకిలా చెప్పాడు? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  ఏరుదాటినా సర్వే మాత్రం తన అధినేత్రి సోనియమ్మను తలుచుకొని బీజేపీ నేతలకు ఒకింత షాక్ ఇచ్చారని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.