రాజపుత్రుల రక్తం ఒక్క చెక్కైునా ఆమె శరీరంలో ఉంటే డాక్యుమెంట్లు చూపాలి

Sat May 14 2022 08:43:27 GMT+0530 (India Standard Time)

Prince Yakub Habeebuddin Tucy reacted on BJP MP

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా చెప్పే తాజమహాల్ ను నిర్మించిన స్థలం తమదేనంటూ జైపూర్ మాజీ యువరాణి.. బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపటమే కాదు.. కొత్త వివాదానికి తెర తీసినట్లైంది. ఇప్పటికే.. తాజ్ కు సంబంధించిన వివాదాలు సరిపోనట్లుగా.. అసలు ఆ అద్భుత కట్టడాన్నికట్టిన భూమినే వివాదంలో ఉందన్న భావన కలిగేలా ఆ మహిళా ఎంపీ మాటలు ఉన్నాయి.‘‘మా పూర్వీకుల నుంచి మొఘలులు ఆ స్థలాన్ని లాక్కున్నారు. తాజ్ నిర్మించిన భూమి మాదేనని చెప్పటానికి అవసరమైన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి’’ అంటూ ఆమె వ్యాఖ్యానించటం తెలిసిందే.  ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై మొఘలుల వారసుడిగా చెప్పే ప్రిన్స్ యాకూక్ హబీబుద్దీన్ టూసీ రియాక్టు అయ్యారు.

సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశారు. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ ఆయన.. ఘాటు సవాలు విసిరారు. మొఘలులు.. రాజపుత్రుల మధ్య ఉన్న స్నేహబంధాన్ని.. ప్రేమానుబంధాలను విచ్ఛిన్నం చేయటానికి ఆమె ప్రయత్నిస్తున్నారని.. ఆ తీరును మార్చుకోవాలన్నారు. అంతేకాదు.. ఆమె శరీరంలో ఒక్క బొట్టు అయినా రాజపుత్రుల రక్తం ఉంటే.. తాజ్ మహల్ నిర్మించిన భూమి తమదేనన్న డాక్యుమెంట్లను చూపించాలని సవాలు విసిరారు.

ఆమె చేసిన భూకబ్జా ఆరోపణలు నిరాధరమన్నారు. ఆమె వాదనల్ని ఇడియాటిక్ చర్యలుగా అభివర్ణించిన ఆయన.. తన 27 మంది నానమ్మలలో 14 మంది రాజపుత్రులని.. అక్బర్ పాలన నుంచి రాజ్ పుట్ లు మొఘలులతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై మొఘలుల వారసుడిగా చెప్పే టూసీ మాటల్లో చెప్పాలంటే.. ‘‘మీ పోతీఖానాలో పత్రాలు ఉండి ఉంటే వాటిని చూపించండి. మీ శరీరంలో రాజపుత్రుల రక్తం చుక్క ఒక్కటి ఉన్నా వెంటనే ఆ పత్రాల్ని బహిర్గతం చేయండి. ఇలాంటి చౌకబారు ప్రకటనల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు’’ అని ఆయన ప్రజలను కోరారు.

ఇంతకాలం తాజ్ మహల్ హిందువుల దేవాలయమని.. దాన్ని తాజ్ మహల్ గా మార్చారన్న వాదనల గురించి తెలిసిందే. ఇది ఒక కొలిక్కి రాక ముందే.. ఇప్పుడు తాజ్ మహల్ నిర్మించిన స్థలమే తమదంటూ కొత్త వివాదానికి తెర తీసిన బీజేపీ ఎంపీ.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లతో ఆ ప్రకటన చేసి ఉంటే బాగుండేది. అందుకు భిన్నమైన వాదనలతో వాతావరణాన్ని వేడిక్కెంచటం తప్పంచి మరింకేమీ ఉండదన్న విషయాన్ని ఆమె గుర్తిస్తే మంచిది. మరి.. మొఘలుల వారసుడిగా చెప్పే టూసీ ఘాటు సవాలుకు ఆమె ఏ రీతిలో స్పందిస్తారో చూడాలి.