Begin typing your search above and press return to search.

మోడీకి ట్విట్ట‌ర్ సెగ‌.. నియంత్రించ‌లేక ఛ‌స్తున్న అధికారులు!!

By:  Tupaki Desk   |   26 Feb 2021 1:20 PM GMT
మోడీకి ట్విట్ట‌ర్ సెగ‌.. నియంత్రించ‌లేక ఛ‌స్తున్న అధికారులు!!
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అమితంగా ఇష్ట‌ప‌డే సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో ట్విట్ట‌ర్ ప్ర‌ధాన‌మైంది. ప్ర‌పంచంలోని దేశాధినేత‌ల్లో ట్విట్ట‌ర్‌ను ఎక్కువ‌గా వినియోగించేవారిలోను, ఎక్కువ మంది ఫాలోవ‌ర్లు ఉన్న‌వారిలోనూ ప్ర‌ధాని మోడీ రికార్డు సృష్టించారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కు పొగ‌డ్త‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చిన సోష‌ల్ మీడియా జ‌నాలు.. ఇప్పుడు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. ‘మోదీ.. ఉద్యోగమివ్వు’ (మోడీ రోజ్‌గార్ దో/మోడీ జాబ్ దో) అంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.

ఎంతలా అంటే గత వారం రోజులుగా ట్విట్టర్‌లో ‘మోడీ.. ఉద్యోగమివ్వు’ అనే హ్యాష్‌ట్యాగే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఒక్క రోజే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై సుమారు 50 లక్షల ట్వీట్లు వచ్చాయి. ఇంకా పెద్ద సంఖ్యలో ట్వీట్లు పడుతూనే ఉన్నాయి. క్షణాల్లో వేల సంఖ్యలో ట్వీట్లు వేస్తున్నారు. ఈ అంశం కొద్ది రోజులుగా ట్విట్టర్‌ను కుదిపివేస్తోంది. ప్రభుత్వం ఈ విషయమై పెదవి విప్పకపోయినప్పటికీ.. అంతర్గతం గా దీనిపై విస్తృత చర్చే జరుగుతోంది. ఒక ద‌శ‌లో ట్విట్ట‌ర్‌ను ఆపేయాల‌ని కూడా అనుకున్నార‌ట‌. కానీ.. అధికారులు వ్య‌తిరేక‌త రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్టు స‌మాచారం.


కేంద్రం నుంచి అధికారికంగా వెల్లడైన వివరాల ప్రకారమే.. 2020 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 23.74 శాతంగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోడీ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఇచ్చిన హామీని ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేక పోయారు. అంతే కాకుండా ప్రధానమంత్రి మన్మోహన్ హయాంలో నిరుద్యోగం గురించి మోడీ చేసిన ట్వీట్లను బ‌ట్టి.. ఆయ‌న ఖ‌చ్చితంగా ఇస్తార‌ని న‌మ్మిన యువ‌త కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు, ట్వీట్ల‌ను ప్ర‌స్తావిస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు.

ఆదాయ ఆర్జన కోసం పకోడీలు వేసుకొమ్మని మోడీ చేసిన వ్యాఖ్యలపై మీమ్స్ వేస్తూ నిరసన తెలుపుతు న్నారు. ఇక మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, నోట్ల రద్దు, జీఎస్టీ అంశాలు కూడా పెద్ద ఎత్తున ప్రస్తావిస్తున్నారు. ‘యువత మన్‌ కీ బాత్ వినండి’, ‘ప్రసంగాలు, వాగ్దానాలు కాదు ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ ట్వీట్ల వరద పారిస్తున్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో నిరుద్యోగ రేటు 5.61శాతం కాగా.. 2020 డిసెంబరు నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజల్లో నిరుద్యోగ రేటు 7.8గా ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

నిరుద్యోగ యువతో ఎక్కువగా గ్రాడ్యూయేట్లే ఉన్నారు. దేశ పురోభివృద్ధిలో అత్యంత కీలకమైన 20-24 వయసువారిలో నిరుద్యోగ రేటు ఏకంగా 37 శాతం ఉంది. వారిలో 63 శాతం మంది పట్టభద్రులని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)’ నివేదిక చెబుతోంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒక గ్రాడ్యూయేట్ మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగాల్లో ఇలా యువత వాటా తగ్గడం దీర్ఘకాలంలో దేశాభివృద్ధిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక‌, తాజాగా కేంద్ర‌ప్ర‌భుత్వ సంస్థ‌లను అమ్మేస్తామ‌ని ప్ర‌క‌టించిన‌నేప‌థ్యంలో యువత మ‌రింత మండిప‌డుతున్నారు. మ‌రి ఇది.. మున్ముందు పెరిగితే.. మూడోసారి అధికారంలోకి రావ‌డం క‌ష్టమేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.