Begin typing your search above and press return to search.

ఖాతాల్లోకి రూ.15 లక్షలు.. మోడీపై సెటైర్లు

By:  Tupaki Desk   |   9 Oct 2019 7:22 AM GMT
ఖాతాల్లోకి రూ.15 లక్షలు.. మోడీపై సెటైర్లు
X
అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరకు ముంతమామిడి పండున్నాడే మోడీజీ’ అని ఇప్పుడు సోషల్ మీడియాలో పాటలు పాడేసుకుంటున్నారు నెటిజన్లు.. హామీలిచ్చి నెరవేర్చని నేతలను ఎండగట్టేలా మీమ్స్ - సెటైర్లు - విమర్శలతో హల్ చల్ చేసే నెటిజన్లు సోషల్ మీడియాలో ఇప్పుడు మోడీని కూడా వదలడం లేదు.. ప్రధాని మోడీజీ ఎన్నికల ముందర ఇచ్చిన ‘ ప్రతీ ఒక్కరి ఖాతాల్లోకి రూ.15 లక్షల నల్లడబ్బు’ హామీపై చెడుగుడు ఆడేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ.. మోడీ 2014 ఎన్నికలకు ముందు విదేశాల్లోని బ్యాంకుల్లో ఉన్న నల్లడబ్బును తీసుకొచ్చి ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని బీజేపీ అభ్యర్థిగా నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఫలితం కనిపించలేదు. చివరకు దేశంలోని నల్లడబ్బును అయినా వెలికితీద్దామని దేశంలో పెద్ద నోట్ల రద్దు చేశారు. అదీ బెడిసికొట్టింది. పెద్దగా బ్లాక్ మనీ బయటపడలేదు.

2019 ఎన్నికల్లో మోడీ తెస్తానన్న బ్లాక్ మనీ.. ఖాతాల్లో 15 లక్షలు ఏవీ అంటూ ప్రతిపక్షాలు - నెటిజన్లు విమర్శలు చేసినా మోడీ స్పందించలేదు. ఓటర్లు కరుణించి రెండోసారి గద్దెనెక్కారు మోడీజీ.. అయితే తాజాగా భారతీయుల తొలి విడత స్విస్ అకౌంట్ల వివరాలను ఎలాగోలా కష్టపడి కేంద్ర ప్రభుత్వం సంపాదించింది. అందులో భారతీయుల ఖాతాల్లో పెద్దగా నల్లడబ్బు లేదని తేలిందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో నాడు మోడీ ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటూ.. త్వరలోనే ప్రతీ ఒక్క భారతీయుడి అకౌంట్లోకి రూ.15 లక్షలు వస్తాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు. కొండను తవ్వి ఎలుకను మోడీ పట్టుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.. ఏదీ ఏమైనా మోడీ నల్లడబ్బు తేవడం.. మన అకౌంట్లలో పడడం వట్టి భ్రమే అని కొందరు విమర్శలు చేస్తున్నారు.