Begin typing your search above and press return to search.

బాబు కంటే ముందు షర్మిలకు అపాయింట్మెంట్...?

By:  Tupaki Desk   |   7 Dec 2022 7:35 AM GMT
బాబు కంటే ముందు షర్మిలకు అపాయింట్మెంట్...?
X
బీజేపీ తెలుగు రాజకీయాలను ఔపాసన పట్టేసింది. రాజకీయ నాయకుల ప్లస్సులు మైనస్సులు రెండూ లెక్క వేసి మరీ తనదైన శైలిలో రాజకీయ సయ్యాట ఆడుతోంది. దాంతో ఢక్కామెక్కీలు తిన్న చంద్రబాబు లాంటి వారు సైతం కొత్త వ్యూహాలను రూపొందించుకోలేక చతికిలపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో నిజానికి బీజేపీ బలం ఎంత అంతే ఏమీ లేదు అనే చెప్పాలి.

ఉంటే గింటే తెలంగాణాలో కాస్తా ఉంది. ఏపీలో అయితే అసలు లేదు. కానీ బీజేపీ వెంటపడుతూ వెంపర్లాడుతూ వంగి వంగి దండాలు పెడుతూ నేతలు ఉన్నారు. దానికి కారణం వారి మీద వారికి నమ్మకం లేకపోవడం, తమలో ఉన్న బలహీనతలను బీజేపీ ముందు కోరి మరీ వెళ్ళబోసుకోవడం. ఏపీకి చెందిన చంద్రబాబు సామాన్య నాయకుడు కాదు.

రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న వారు. అలాంటి నేత కావడమే ఆయనకు దగ్గరగా తీసుకునేందుకు బీజేపీ పెద్దలకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు. ఒకసారి బాబుతో సావాసం చేసినందుకు ప్రతిఫలం అనుభవించామని, ఈసారి అలా కాకుండా చూసుకోవాలని వీలైతే పూర్తిగా దూరం పెట్టడం లేకపోతే చివరి నిముషం దాకా ఊరించి అపుడు తమకు అనుకూలంగా టీడీపీతో పొత్తులు చేసుకోవడం అన్న రాజకీయ అజెండాను బీజేపీ అమలు చేస్తోంది.

ఈ నేపధ్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నా చంద్రబాబుకు మోడీ నుంచి కానీ అమిత్ షా నుంచి కానీ అపాయింట్మెంట్ అయితే లభించలేదు. అదే సమయంలో అనూహ్యంగా తెలంగాణా రాజకీయాలో అతి చిన్న పార్టీగా ఉన్న వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ తానుగా చేశారు. ఏకంగా పది నిముషాల పాటు ఆయన చర్చలు జరిపారు. ఆమెను ఢిల్లీకి కూడా ఆహ్వానించారు అని సమాచారం అందుతోంది.

ఈ మేరకు తెలియవస్తున్న మ్యాటర్ ఏంటి అంటే వచ్చే వారంలో వైఎస్ షర్మిల ఢిల్లీలో ల్యాండ్ అవుతారు అని. ఆమె నేరుగా ప్రధాని మోడీతో భేటీ అయి అనేక విషయాలు చర్చిస్తారు అని. నిజానికి తెలంగాణాలో ఈసారి టీయారెస్ ని ఓడించాలి అని బీజేపీ భావిస్తోంది. దాని కోసం ఏ ఒక్క అవకాశాన్ని అసలు వదులుకోదలచుకోవడంలేదు. టీయారెస్ వ్యతిరేక శక్తులను కలుపుకుని పోవాలని చూస్తోంది.

అందులో భాగమే షర్మిలతో ప్రధాని మంతనాలు అని అంటున్నారు. షర్మిల వైఎస్సార్ లెగసీ కాబట్టి ఆమెను తమ వైపు తిప్పుకుంటే తెలంగాళాలో ఆయన అభిమానుల ఓట్లు తమకు పడుతాయని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో అక్కడ ఉన్న బలమైన రెడ్డి సామాజికవర్గం ఓట్లను కూడా బీజేపీ టార్గెట్ చేస్తోంది. అందులో భాగమే వైఎస్ షర్మిలను తమ వైపు తిప్పుకోవాలని చూడడం అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల పార్టీతో కలసి బీజేపీ ఎన్నికల పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తుంది అని అంటున్నారు. ఈ రెండు పార్టీలు బరిలోకి దిగితే వైఎస్సార్టీపీకి బలమున్న నల్గొండ, ఖమ్మం వంటి ఏరియాల్లో కూడా కమలానికి కొంత రాజకీయ అవకాశాలు ఉంటాయని. అలాగే హైదరాబాద్ లో సెటిలర్లుగా ఉన్నరాయలసీమకు చెందిన ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవచ్చునని బీజేపీ లెక్కలు వేస్తోంది.

ఇదిలా ఉంటే సడెన్ గా బీజేపీ వ్యూహాలలోకి వైఎస్ షర్మిల దూసుకుని రావడం టీడీపీ రాజకీయ అవకాశాలను దెబ్బతీసేలా ఉంది అని అంటున్నారు. తెలంగాణాలో టీడీపీతో బీజేపీ పొత్తుని కుదుర్చుకుని దాన్ని ఏపీలోకి కూడా విస్తరించడం ద్వారా జగన్ని కట్టడి చేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అందుకోసమే ఆయన రాయబేరాలను తెర వెనక నడుపుతున్నారు అని అంటున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో టీడీపీతో పొత్తు వద్దు అని అంటున్నారుట.

2018 లో కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఇబ్బందులు పడిందని, ఈ పొత్తులను హైలెట్ చేసి కేసీయార్ రెండవసారి గెలిచారని, ఆంధ్ర పాలకులు అని దుమ్మెతి పోశారని ఇపుడు అలాంటి చాన్స్ ఇవ్వకూడదని తెలంగాణా బీజేపీ నాయకులు చెబుతున్నారుట. ఇపుడు షర్మిల రూపంలో తమకు మరో అవకాశం దొరికింది కాబట్టి బాబుని పక్కన పెట్టేయవచ్చు అని బీజేపీ పెద్దలు అనుకుంటే మాత్రం కచ్చితంగా అది ఆయన వ్యూహాలకు అతి పెద్ద దెబ్బగా మారుతుంది అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు చాలా కాలంగా మోడీతో అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు. కానీ పరిస్థీతి చూస్తూంటే ఆయన కంటే ముందే షర్మిలకు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చేలా కనిపిస్తోంది అంటున్నారు. అదే జరిగితే బాబుకు తీరని నిరాశ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.