Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నికలు : చంద్రబాబు మౌనం వెనక చంద్రజాలం...?

By:  Tupaki Desk   |   7 July 2022 8:30 AM GMT
రాష్ట్రపతి ఎన్నికలు : చంద్రబాబు మౌనం వెనక చంద్రజాలం...?
X
ఊరకే మహానుభావులు పెదవి మూసుకోరు. వారి కనుక సైలెంట్ గా ఉన్నారూ అంటే ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారనే అనుకోవాలి. ఇపుడు చంద్రబాబు గురించి కూడా అలాంటిదే అనుకోవాలేమో. దేశంలో రాష్ట్రపతి ఎన్నికల సందడి గట్టిగానే ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఎవరి శక్తి మేరకు వారు ఈ ఎన్నికల్లో తమ పాత్రను రుజువు చేసుకునేందుకు తాపత్రయపడుతున్నాయి. పక్కన ఉన్న తెలంగాణాలో విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తే కేసీయార్ చేసిన రాజకీయ హడావుడి అంతా ఇంతా కాదు. ఏకంగా దేశానికి రాష్ట్రపతి అయిన వారే తమ తెలంగాణా గడ్డకు వచ్చేశారు అన్నట్లుగా ఆయన కలకలం రేపారు.

తన పొలిటికల్ రూట్ ఇదీ అని పక్కాగా చెప్పి గెలిచినా ఓడినా కూడా యశ్వంత్ అని చెప్పి మరీ టీయారెస్ ఢంకా భజాయిస్తోంది. దీని వెనక టీయారెస్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. యాంటీ మోడీ నినాదాన్ని తెలంగాణా సమాజానికి అలాగే దేశానికి చాటి చెప్పడం ద్వారా విస్తృతమైన లాభాలను పొందాలనుకుంటోంది. ఇదే తీరున దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఏపీకి వస్తే మాత్రం రాజకీయం చాలా నిస్తేజంగా కనిపిస్తోంది.

అధికార వైసీపీ ఎటూ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించేసి ఊరుకుంది. మా రూట్ ఇదే అని ఆ పార్టీ అలా చెప్పింది అన్న మాట. ఒక విధంగా ఏ పేచీ పూచీ లేని రూట్ అది అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక టీడీపీ మీదనే అందరి దృష్టి ఉంది. నిజానికి చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తిని కలిగించే విషయం.

బాబు అంటే సామాన్యుడేమీ కాదు, ఆయన గండరగండ రాజకీయ నాయకుడు. ఆయన గతంలో చాలా సార్లుగా తానుగా చెప్పుకున్నట్లుగా రాష్ట్రపతులను, ప్రధానులను తానే చేశాను అన్న దానితో తీసుకుంటే ఇపుడు ఈ మౌనం, ఎలాంటి సౌండ్ చేయకపోవడం మాత్రం కడు చిత్రంగానే ఉంది మరి. చంద్రబాబు ఏమైనా సామాన్య నాయకుడా. ఆయనకు జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు ఈ రోజుకీ ఉన్నాయి. అలాంటి బాబు తాను బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నారా లేక విపక్షాల సైడ్ తీసుకుంటున్నారా అంటే చెప్పలేని స్థితి.

అయితే బాబు మౌనం వెనక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. నిజానికి తెలుగుదేశానికి ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజిలో జీరో పాయింట్ సిక్స్టీ పెర్సెంట్ ఓట్లే ఉన్నాయి. ఎంపీలు నలుగురు ఉంటే ఎమ్మెల్యేలు నికరంగా పందొమ్మిది మంది ఉన్నారు. వీరి ఓట్లు చాలా తక్కువ. మరో వైపు బీజేపీకి తన అభ్యర్ధిని గెలిపించుకునేందుకు పూర్తి మెజారిటీ అయితే వచ్చేసింది. బిజూ జనతాదళ్, వైసీపీ మద్దతు తరువాత అదనపు ఓట్లు వస్తాయి తప్ప కొత్తగా టెన్షన్ పడాల్సింది లేదు. లేటెస్ట్ గా బీఎస్పీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చింది. శివసేనలో చీలికతో అక్కడ ఎంపీల ఓట్లు కూడా ఎన్నో కొన్ని పడతాయని అంటున్నారు.

ఇలా మంచి మెజారిటీతోనే బీజేపీ క్యాండిడేట్ గెలవడం ఖాయం అని చెబుతున్నారు. విపక్షాల వైపు నుంచి చూస్తే ఓడినా సరే మంచి నంబర్ ని సాధించాలన్న తాపత్రయం కనిపిస్తోంది. అందుకే ఉన్న వారంతా యశ్వంత్ కి గట్టిగా నిలబడ్డారు. ఆయన కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితిలలో నంబర్ గురించి ఆలోచించకుండా బాబు తీసుకునే నిర్ణయం అయితే రాజకీయంగా మాత్రం సంచలనం రేపుతుంది అనే చెప్పాలి.

ఇప్పటిదాకా అయితే రాష్ట్రపతి ఎన్నికల మీద టీడీపీ అఫీషియల్ గా చర్చించింది లేదు. మరో వైపు చూస్తే అటూ ఇటూ కూడా బాబుని ఎన్నికల్లో మద్దతు విషయం ఎవరూ కూడా చర్చించలేదు అన్న మాట కూడా ఉంది. మరి తనను ఖాతరు చేయని వారి విషయంలో కోరి ఎగబడి మద్దతు ఇచ్చి ఓట్లేయడం ఎందుకు అని టీడీపీ అనుకుంటే ఎన్నికలకు దూరంగా ఉండి తన న్యూట్రల్ స్టాండ్ ని బయటపెట్టుకోవచ్చు.

అలా కాదూ రేపటి రోజున బీజేపీ విషయంలో తన రాజకీయం ఎత్తులు పొత్తులు లాంటివి కంటిన్యూ చేయడానికి కొంత ఆశను ఉంచుకోవాలీ అనుకుంటే ఆ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వవచ్చు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. టైమ్ చూస్తే పట్టుమంది పది రోజులు మాత్రమే ఉంది. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్న వేళ బాబు వైపే అందరి చూపు ఉంది. మరి చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయం అయినా కేవలం ఏపీ రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయవచ్చు.

చంద్రబాబు తటస్థ వైఖరి అవలంబిస్తే మాత్రం దేశంలో విపక్ష రాజకీయ శిబిరానికి ఇపుడు కాకపోయినా రానున్న రోజుల్లో కొత్త ఊపు రావచ్చు. ఎన్నికలకు ఆరు నెలల ముందు యాంటీ మోడీ స్టాండ్ బాబు తీసుకుంటే ఏపీలోనూ దేశంలోనూ కూడా ఆయన చక్రం గిర్రున తిరిగే చాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.