Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి దంప‌తుల‌కు గుడిలో అవ‌మానం...!

By:  Tupaki Desk   |   28 Jun 2018 5:09 AM GMT
రాష్ట్రప‌తి దంప‌తుల‌కు గుడిలో అవ‌మానం...!
X
రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ - ఆయన సతీమణి సవిత దంప‌తుల‌కు ఊహించ‌ని ప‌రాభవం ఎదురైంది. ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖుల పట్ల పూరీ జగన్నాథ ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడునెలల క్రితం కోవింద్ దంపతులు ఆలయాన్ని దర్శించినప్పుడు అక్కడ ఆలయ విధుల్లో ఉన్న ఆలయ సేవకులు కొందరు వారిని నెట్టివేసినట్లు వచ్చిన వార్తలపై పూరీ జిల్లా యంత్రాంగం బుధవారం విచారణ చేపట్టింది. మార్చి 18న రాష్ట్రపతి కోవింద్ దంపతులు పూరీ జగన్నాథ ఆలయ దర్శనానికి వెళ్లారు. గర్భగుడి సమీపంలో కొందరు ఆలయ సేవకులు రాష్ట్రపతి మార్గాన్ని అడ్డుకుని - దేశ ప్రథమ మహిళను నెట్టారు. ఈ ఘటనపై మార్చి 19న రాష్ట్రపతి భవన్ అధికారులు పూరీ జిల్లా కలెక్టర్ అరవింద్ అగర్వాల్‌ కు సమాచారం అందించారు. దీనిపై మార్చి 20న అధికారులు జగన్నాథ ఆలయ నిర్వాహకుల (ఎస్‌ జీటీఏ) సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం మినిట్స్ వివరాలు తాజాగా బయటకురావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

రాష్ట్రపతి పర్యటన కోసం మార్చి 18న ఆలయ అధికారులు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులను ఉదయం 6.35 గంటల నుంచి 8.40 వరకు దర్శనానికి అనుమతించలేదు. రాష్ట్రపతి దంపతుల వెంట కొందరు ఆలయ సేవకులు - కొందరు అధికారులను మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఆలయ గర్భగుడిలోని రత్నసింహాసనం వద్దకు రాష్ట్రపతి వెళ్లినప్పుడు.. అక్కడున్న కుంతియా మెకాప్ సేవాంత్ (ఆలయ సేవకుల్లో ఇదో విభాగం) ఆయనకు చోటు ఇవ్వలేదని - దేవతా విగ్రహాలను దర్శించుకునే సందర్భంలోనూ ఇద్దరు సేవకులు రాష్ట్రపతిని - ఆయన సతీమణిని పక్కకు నెట్టివేశారని ప్రగతివాది అనే స్థానిక వార్తాపత్రిక పేర్కొంది. ఈ వివాదం నేపథ్యంలో ఈ ముగ్గురికి నోటీసులు ఇవ్వాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత సురేశ్‌ కుమార్ రౌత్రే స్పందిస్తూ.. ``ఇలాంటి ఇబ్బందికర ఘటన తలెత్త్తకుండా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఆలయ సేవకుల ప్రవర్తనతో ఇప్పటివరకు సాధారణ భక్తులే ఇబ్బందులు పడుతూ వచ్చారు. చివరకు రాష్ట్రపతిని కూడా వారు మినహాయించలేదని తెలుస్తోంది` అని చెప్పారు. ఈ ఘటన జరిగిన మాట వాస్తవమేనని ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి ప్రదీప్‌కుమార్ మహాపాత్ర తెలిపారు. `ఆలయంలో రాష్ట్రపతి దంపతులు ఇబ్బంది పడ్డారు. అయితే దీనిపై వారు మాట్లాడేందుకు నిరాకరించారు. కొన్నిరోజులక్రితం ఈ ఘటనపై ఆలయ ధర్మకర్తల మండలితో చర్చించాం. దీనిపై విచారణ జరుగుతోంది` అని మహాపాత్ర చెప్పారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు, జిల్లా కలెక్టర్ వేర్వేరుగా విచారణ జరుపుతున్నారని బీజేడీ ఎంపీ ప్రతాప్ కేసరీదేవ్ తెలిపారు.

కాగా, జగన్నాథ ఆలయంలో రాష్ట్రపతి దంపతులతో ఆలయ సేవకులు దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం దీనిపై స్పందించింది. రాష్ట్రపతి భవన్ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించింది. భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయి కానీ, ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి మాత్రం ఫిర్యాదు ఏదీ అందలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ పాధి వివరించారు.