Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌లో 'వాడిన రోజా'

By:  Tupaki Desk   |   6 Dec 2022 6:31 AM GMT
రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌లో వాడిన రోజా
X
ఎక్క‌డైనా.. ఎప్పుడైనా.. త‌న హ‌వాను నిరూపించుకునేందుకు రెడీగా ఉండే ఏపీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు ఆర్కే రోజా.. ప‌రిస్తితి `వాడిన రోజా`లా మారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమెను సొంత పార్టీ నాయ‌కులు, మంత్రులే ప‌ట్టించుకోలేద‌ని పెద్ద ఎత్తున కామెంట్లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అందునా.. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌లోనే రోజాకు తీర‌ని అవ‌మానం జ‌రిగింద‌ని తెలుస్తోంది. దీంతో ఫైర్ బ్రాండ్ జ‌బ‌ర్ద‌స్త్ రోజాకు పొలిటిక‌ల్ ఘుమ‌ఘుమ‌లు త‌గ్గాయా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. దేశ ప్ర‌థ‌మ పౌరురాలు ద్రౌప‌ది ముర్ము.. రాష్ట్ర‌ప‌తిగా బాద్య‌త‌లు చేప‌ట్టాక తొలిసారి ఏపీకి వ‌చ్చారు. రెండు రోజుల పాటు ప‌ర్య‌టించారు. అయితే, ఆమె ఒక ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. విజ‌య‌వాడ‌, విశాఖ‌, తిరుప‌తిలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి వెంట గౌర‌వార్థం ఉండాల్సిందిగా సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ప‌ర్యాట‌క మంత్రి ఆర్కే రోజా.. ఈ రెండు రోజులు రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌నకే త‌న షెడ్యూల్ కేటాయించారు. దీంతో రోజా ఆదివారం, సోమ‌వారం కూడా రాష్ట్ర‌ప‌తి వెంటే ఉన్నారు.

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన అన్ని కార్య‌క్ర‌మాలు స‌హా విశాఖ‌లో జ‌రిగిన నేవీడే కార్య‌క్ర‌మానికి కూడా రోజా హాజ‌రయ్యారు. ఇక్క‌డ మంత్రిగా రోజాకు స‌మున్న‌త గౌర‌వ‌మే ద‌క్కింది. రాష్ట్ర‌ప‌తి గౌర‌వార్తం ఇచ్చిన విందులోనూ ఆమె పాల్గొని భోంచేశారు. అయితే, ఎటొచ్చీ.. సీమ ప్రాంతంలోని తిరుప‌తి(రోజా సొంత జిల్లా కూడా)లో సోమ‌వారం జ‌రిగిన‌ రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌లో మాత్రం రోజాకు ఊహించ‌ని షాక్ త‌గిలింద‌ని అంటున్నారు.

తిరుమ‌ల‌లో రాష్ట్ర‌ప‌తి శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆమెను, ఆమె వెంట వ‌చ్చిన కుటుంబ స‌భ్యురాలిని మాత్రమే లోప‌లికిపంపించి రోజాను త‌ర్వాత పంపించార‌ని అంటున్నారు.

ఇక‌, త‌ర్వాత జ‌రిగిన ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాలయంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అస‌లు రోజాను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీనికి కార‌ణం ఈ కార్య‌క్ర‌మం అంతా కూడా రోజా ప్ర‌త్య‌ర్థిగా భావించే మ‌రో మంత్రి, వైసీపీ కీల‌క నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చేతుల మీదుగా జ‌ర‌గ‌డ‌మే. దీంతో రోజాను విశ్వ‌విద్యాల‌యంలో ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోగా.. వేదిక‌పై కూడా కూర్చునే అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో వేదిక కింద భాగంలో రెండో వ‌రులో కూర్చున్నారు.

ఇక‌, తిరుప‌తి విమానాశ్ర‌యంలో రాష్ట్ర‌ప‌తికి వీడ్కోలు ప‌లికే కార్య‌క్ర‌మంలోనూ రోజాకు ప్రాధాన్యం ద‌క్క‌లేదని తెలుస్తోంది. ఆమె బ‌దులు కార్య‌క్ర‌మం అంతా కూడా మంత్రులు నారాయ‌ణ స్వామి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి న‌డిపించారు. వీరిద్ద‌రూ కూడా రోజాకు వ్య‌తిరేక వ‌ర్గంగానే ఉన్నారు. మొత్తానికి రోజాకు సొంత జిల్లాలోనే అవ‌మానం జ‌రిగింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.