Begin typing your search above and press return to search.

పౌరసత్వ సవరణ బిల్లు కు రాష్ట్రపతి ఆమోదం ...!

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:51 AM GMT
పౌరసత్వ సవరణ బిల్లు కు రాష్ట్రపతి ఆమోదం ...!
X
ఎట్టకేలకు బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకుంది. పార్లమెంట్ లో వ్యతిరేకత ఎదురైనా , కొన్ని రాష్ట్రాలలో స్పష్టమైన వ్యతిరేఖత కనిపిస్తున్నప్పటికీ కూడా బీజేపీ తన పంథా మార్చుకోకుండా ముందుకు సాగి ..పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ని పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేసారు. దీనితో తాజాగా ఆ బిల్లుకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ..పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా మారింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం అధికారిక గెజిట్ విడుదల చేయడంతో చట్టంగా అమల్లోకి వచ్చింది.

తాజా చట్టం ప్రకారం... 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌ లో మతపరమైన హింసను ఎదుర్కొని దేశంలోకి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు భారత పౌరసత్వం పొందేందుకు అవకాశం లభించింది. ఆయా దేశాల్లో మతపరమైన వేధింపుల్ని తట్టుకోలేక వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం లభించనుంది.

పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో సోమవారం, రాజ్యసభ లో బుధవారం ఆమోదం పొందింది. గురువారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కాగా బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసోంలో చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. అసోం ప్రజల హక్కులకు ఎలాంటి భంగమూ కలగనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ బిల్లను తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మద్దతు ప్రకటించగా, టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. రాజ్యసభలో పౌరసత్వ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా.. ఓటింగ్‌కు ముందు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఈ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ కూడా గత ఐదేళ్లలో తొలిసారి విప్ జారీ చేసింది.