Begin typing your search above and press return to search.

కరోనాను చంపే మాస్క్‌ సిద్ధం !

By:  Tupaki Desk   |   13 May 2021 12:30 AM GMT
కరోనాను చంపే మాస్క్‌ సిద్ధం !
X
కరోనా వైరస్ యావత్ భారతాన్ని వణికిపోయేలా చేస్తుంది. గత సంవత్సర కాలంగా ఈ మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూనే ఉంది. వ్యాక్సిన్ వచ్చింది ఇక తగ్గిందిలే అనుకునేలోపే తిరిగి మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. రోజూకీ లక్షల్లో కేసులు నమోదవుతుండగా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే , దేశంలో ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత మరింత తీవ్రంగా బాధిస్తోంది. ఆక్సిజన్ కొరత తో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నాకానీ నిత్యం మాస్క్ ధరించాలని, బయటకు వెళ్ళినప్పుడు డబుల్ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాస్క్‌ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కరోనా వైరస్‌ ను చంపే మాస్క్‌ని అభివృద్ధి చేశారు. 12వ తరగతి విద్యార్థిని దీనిని అభివృద్ధి చేసింది. ఈ మాస్క్‌ కరోనాను చంపేస్తుందని విద్యార్థి చెప్తుంది.

వివరాల్లోకి వెళ్తే .. పశ్చిమ బెంగాల్‌ పుర్బ బర్ధమాన్‌ జిల్లాకు చెందిన దిగ్నాటికా బోస్‌ ఇంటర్‌ సెకడింయర్‌ చదువుతుంది. కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేయడం ఎలా అని ఆలోచించసాగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టి విభిన్నమైన మాస్క్‌ ను రూపొందించింది. ఈ మాస్క్‌ కరోనా వైరస్‌ ను చంపేస్తుందని తెలిపింది. ఈ మాస్క్‌ ను ముంబైలోని గూగుల్స్‌ మ్యూజియం ఆఫ్‌ డిజైన్‌ ఎక్సలెన్స్‌ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దిగ్నాటిక మాట్లాడుతూ.. నేను తయారు చేసిన ఈ మాస్క్‌ లో మూడు చాంబర్లుంటాయి. మొదటి చాంబర్‌ లో ఉండే అయాన్‌ జనరేటర్‌ గాలిలోని దుమ్ము కణాలను వడబోస్తుంది. ఇలా ఫిల్టర్‌ అయిన గాలి సెకండ్‌ చాంబర్‌ గుండా మూడో దానిలోకి ప్రవేశిస్తుంది. కెమికల్‌ చాంబర్‌ గా పిలిచే దీనిలో సబ్బు కలిపిన నీరు ఉంటుంది. ఫిల్టర్‌ అయ్యి వచ్చిన గాలిలో ఉండే కరోనా వైరస్‌ ను ఈ సబ్బు నీరు చంపేస్తుంది అని తెలిపింది. ఇక కోవిడ్‌ పేషెంట్లు ఈ మాస్క్‌ ను వినియోగిస్తే.. పైన చెప్పిన ప్రాసేస్‌ రివర్స్‌ లో జరుగుతుంది. వారు వదిలిన గాలిలో కోవిడ్‌ క్రిములుంటాయి. థర్డ్‌ చాంబర్‌ లోని సబ్బు నీటిలోకి ప్రవేశించినప్పడు అవి చనిపోతాయి. ఆ తర్వాత వైరస్‌ రహిత గాలి మిగతా రెండు చాంబర్ల గుండా బయటకు వస్తుంది. దీని వల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చు అని తెలిపింది.