ప్రవీణ్ కుమార్ దారెటు?

Wed Jul 21 2021 19:00:01 GMT+0530 (IST)

Praveen voluntary retirement has led to differing views on his future

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కనున్నాయా? అంటే విశ్లేషకులు అవుననే అంటున్నారు.  అనూహ్యంగా ఐపీఎస్ అధికారి  ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడమే అందుకు కారణమని చెప్తున్నారు. మరో ఆరేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వేడి నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.



ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయినప్పటికీ చాలా కాలంగా పోలీసు శాఖకు సంబంధం లేని సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన అధికారిగా ఆయనకు పేరు ఉంది. చదువు క్రీడలు ఇలా అన్ని విషయాల్లో ఆ విద్యా సంస్థలను ఆయన ఉత్తమంగా తీర్చిదిద్దారనే చెప్పుకుంటున్నారు. స్వేరో పేరుతో ఓ రకమైన సమాంతర వ్యవస్థనూ నెలకొల్పారు.

అయితే ఈ వ్యవస్థ తర్వాత కులం మతం పట్టింపు లేకుండా దైవదూషణకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలూ వచ్చాయి. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సర్వీస్ నుంచి వైదొలగాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అప్పుడు ఆయన తనను తాను సమర్థించుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై అసలు స్పందించనే లేదు.

ఇప్పుడు హఠాత్తుగా ప్రవీణ్ స్వచ్ఛంద విరమణ తీసుకోవడంతో ఆయన భవిష్యత్‌పై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఆయనను అభ్యర్థిగా నిలబెడతారనే ప్రచారం సాగుతోంది. ఈటలను ఎదుర్కొనేందుకు సీఏం కేసీఆర్ ప్రవీణ్‌ను బరిలో దింపేందుకు వ్యూహం పన్నుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఆయన సొంత రాజకీయ పార్టీ పెడతారని సన్నిహిత వర్గాలు అంటున్నాయని మరో టాక్ వినిపిస్తోంది. జైభీమ్ పేరుతో పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తాను ఏ పార్టీకి అమ్ముడు పోనని ప్రవీణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే సొంత పార్టీ పెట్టేలాగే కనిపిస్తున్నారని రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన చెప్తున్నప్పటికీ ప్రవీణ్ వేసే అడుగులు ఏ దిశగా సాగుతాయో అనే ఆసక్తి మాత్రం నెలకొంది.