ప్లాట్ కు పిలిచి రేప్ చేసి.. పదో అంతస్తు మీద నుంచి కిందకు తోసేశాడు

Fri Sep 24 2021 10:05:21 GMT+0530 (IST)

Pratik Vaish killed his secretary

క్యాలెండర్లో తేదీ మారినంత సహజంగా.. దేశంలోని ఏదో ఒక చోట దారుణ అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన గొప్పలు చెప్పేలా మాటలు చెబుతున్నా.. అత్యాచార దారుణాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న దుస్థితి. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి.. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులో చోటు చేసుకుంది. పందొమ్మిదేళ్ల యువతిని.. ఆమె యజమాని అన్యాయంగా అత్యాచారం చేయటమే కాదు.. ఆమెను పదో అంతస్తు నుంచి కిందకు తోసేసి చంపేసిన వైనం షాకింగ్ గా మారింది.తొలుత తన నేరాన్ని ఒప్పుకోని ఈ వ్యాపారస్తుడు.. చివరకు తాను చేసిన ఘోరాన్ని పోలీసులకు వివరించారు. వీడి ఆరాచకం గురించి తెలిసిన వారెవరూ ఇతన్ని ఉత్తినే వదిలిపెట్టకూడదని.. కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. నలభై ఏళ్ల ప్రతీక్ వైశ్ అనే వ్యక్తి డెయిరీ నిర్వహిస్తుంటాడు. అతని వద్ద బాధితురాలు సెక్రటరీగా పని చేస్తూ ఉంటోంది. ఆమెపై కన్నేసిన అతడు.. తాజాగా పని ఉందని చెప్పి.. కల్యాణ్ పూర్ లోని తన ప్లాట్ కు రమ్మని కోరాడు.

ఆఫీసు పని కోసమని చెప్పటంతో బాధితురాలు భరోసాతో అతడి ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా మాటలు కలిపిన ప్రతీక్.. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరాడు. అందుకు అవసరమైన డబ్బుల్ని కూడా ఇస్తానని ఆశ చూపాడు. అతను చెప్పిన మాటలకు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో.. ఆమెను అత్యాచారానికి గురి చేశాడు. దీంతో.. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తానని ఆమె తేల్చి చెప్పటంతో.. అలెర్టు అయిన నిందితుడు.. ఆమెను పదో అంతస్తు నుంచి ఆమెను కిందకు తోసేశాడు. దీంతో.. ఆమె మరణించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కంపెనీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

తొలుత తాను ఎలాంటి నేరానికి పాల్పడ లేదంటూ అతడికి పోలీసులకు స్పష్టం చేశాడు. అతని మాటలు.. చేతలు తేడా ఉండటంతో.. అలెర్టు అయిన పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ జరపటంతో ఆమె చనిపోయిందని.. తానే పదో అంతస్తు నుంచి కిందకు తోసేసినట్లుగా ప్రతీక్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అత్యాచారం చేసిన అనంతరం పదో అంతస్తు నుంచి బయటకు నెట్టేసినట్లుగా చెప్పి.. తాను చేసిన తప్పును ఒప్పేసుకున్నాడు. న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చిన సదరు వ్యక్తిని రిమాండ్ కు తరలించారు. ఇలాంటోడ్ని ఏం చేసినా తప్పు లేదని చెప్పక తప్పదు.