పీకేతో భారత్‌కే ముప్పునా?

Mon Jul 19 2021 15:00:01 GMT+0530 (IST)

Prashant Kishor Political Strategies

ప్రశాంత్ కిశోర్.. ఉరఫ్ పీకే రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ.. హాట్ టాపిక్‌గా ఉండే.. ఈయనపై తాజాగా ఆసక్తికర చర్చ తెరమీదకి వచ్చింది. ఐఐటీ చదివిన పీకే... 2014 ఎన్నికలకు ముందు.. ఎన్నికల వ్యూహ కర్తగా.. బీజేపీతో పనిచేశారు. ఆ సమయంలో ప్రధానిగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని చేయాలనే సంకల్పంతో పీకే వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే చాయ్ పేచర్చ.. తరహా అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేసి.. సక్సెస్ అయ్యారు. దీంతో పీకేకు క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే పీకే సేవలను పలు రాష్ట్రాల పార్టీలు కూడా వినియోగించుకుంటున్నాయి.ఏపీలో 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి పీకే తన సూచనలు సలహాలతో వైసీపీని ముందుకు నడిపించిన విషయం తెలిసిందే. అయితే.. పీకే వ్యవహార శైలి వల్ల.. దేశానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఎప్పుడూ.. లేని విధంగా దేశంలో కులాల మధ్య చిచ్చు రేగుతోందని.. అదేసమయంలో రాష్ట్రాలు అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కాలంలో ఏ టీవీ చర్చలో చూసినా.. పీకే వ్యవహారం ఆసక్తిగా మారింది. గతంలో గ్రామాల మధ్య పోటీ ఉండేది. కానీ కులాల మధ్య ఉండేది కాదు. పీకే ఎంట్రీతో .. ఈ వ్యవహారం.. యూటర్న్ తీసుకుందనేది విశ్లేషకుల మాట.

ఏ రాష్ట్రంలో పీకే టీం.. కాలు మోపినా ఏపార్టీ తరఫున పనిచేయాలని నిర్ణయించుకున్నా.. వెంటనే సదరు రాష్ట్రంలో కులాల విషయాన్ని ప్రధానంగా వెలుగులోకి తీసుకువస్తారు. పీకే టీం.. బృందాలుగా విడిపోయి.. మొదటగా.. బూత్ స్థాయిలో కులాల మధ్య సర్వే చేస్తుంది. ఈ క్రమంలోనే బూత్ స్థాయి కన్వీనర్లను కులాల ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ఇది .. ఆయా గ్రామాల్లో అప్పటి వరకు లేని.. కుల చిచ్చుకు కారణంగా మారుతోందని అంటున్నారు పరిశీలకులు. గ్రామాల్లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని పీకే టీం పూర్తిగా రచ్చ చేస్తోందనేది విశ్లేషకుల మాట.

ఇక ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంటారో.. ఆ పార్టీ తరఫున పెద్ద ఎత్తున `ఉచిత` హామీలు గుప్పించడం .. పీకే టీం చేస్తున్న రెండో పని. అన్ని ఉచితాలు.. లేదా... నగదు పంపిణీల ద్వారా హామీలు ఇచ్చి.. ప్రజలను ఒక మాయలో ముంచేసి.. ఎన్నికల్లో లబ్ధి పొందడం పీకే టీం చేస్తున్న పని. దీంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీలు ఆయా పథకాలను అమలు చేసేందుకు నిధులు చాలక.. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. ఏకంగా రాష్ట్రాలను దివాలా తీసే పరిస్థితిలోకి నెడుతోందన్నది విశ్లేషకుల మాట. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో.. పీకే టీం పనిచేసిన రాష్ట్రాల్లో ఇదే పరిసస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

ఉదాహరణకు ఏపీ ని తీసుకుంటే.. జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనేక ఉచిత హామీలు గుప్పించారు. ఫలితంగా ఇప్పుడు ఖజానా ఖాళీ అయి.. ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని దుస్థితి వచ్చింది. అదేసమయంలోపీకే టీం పనిచేసిన.. రాష్ట్రాలు.. పశ్చిమ బెంగాల్ బిహార్ పంజాబ్ తదితర రాష్ట్రాల్లో కులాల మధ్య చిచ్చు కనిపిస్తోంది. అదేసమయంలో ఆయా రాష్ట్రాలు కూడా అధిక వడ్డీలకు అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలా మొత్తంగా పీకే అనుసరిస్తున్న విధానాలు.. ఎన్నికల వ్యూహాలతో రాష్ట్రాలు దెబ్బతిని.. అంతిమంగా.. దేశానికే చేటు వస్తోందని అంటున్నారు పరిశీలకులు.