Begin typing your search above and press return to search.

`బాబ్రీ`తీర్పు ముస్లిం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది: ప్రశాంత్ భూషణ్

By:  Tupaki Desk   |   1 Oct 2020 3:45 AM GMT
`బాబ్రీ`తీర్పు ముస్లిం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది: ప్రశాంత్ భూషణ్
X
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితులంతా నిర్దోషులంటూ లక్నో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. ఈ తీర్పును ఎంఐఎం అధినేత ఒవైసీ తప్పుబట్టారు. మసీదు దానంతట అదే కూలిపోయిందా అని ప్రశ్నించిన ఒవైసీ....ఆ మసీదును కూల్చిందెవరో ప్రపంచం మొత్తానికి తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో న్యాయం సమాధి అయిందంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈ తీర్పుపై సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరగదని, న్యాయం జరుగుతుందనే ఒక భ్రమ మాత్రమే ఉంటుందని భావిస్తారని ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.`బాబ్రీ`తీర్పు ముస్లిం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుందని ప్రశాంత్ భూషణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ తీర్పు ఇలాగే వచ్చే అవకాశం ఉందన్న ప్రశాంత్ భూషణ్ దానికి కారణం కూడా చెప్పారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో తీర్పు రావడానికి ముందే బాబ్రీ మసీదు భూమి యాజమాన్య హక్కులపై తీర్పు వెలువరించారని, మసీదును కూల్చినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న పక్షానికి అనుకూలంగా ఆ తీర్పు వచ్చిందని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ముస్లిం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుందని, ఏ తీర్పూ తమకు అనుకూలంగా వస్తున్నట్లు వారికి అనిపించదని ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ముస్లిం సమాజాన్ని రెండో తరగతి పౌరులుగా మార్చేస్తున్నారని, వారి ముందు ప్రస్తుతం చాలా పెద్ద సవాళ్లున్నాయని ఆయన అన్నారు. మెల్లమెల్లగా హిందూ దేశం నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిలు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆగస్ట్ 14న కోర్టు ధిక్కరణ కేసులో భూషణ్ ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పేందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకు,తప్పులను సరిదిద్దుకుంటారని విమర్శలు చేశానని ప్రశాంత్ భూషణ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం కోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. సుప్రీం తీర్పు ప్రకారం ప్రశాంత్ భూషణ్ ఒక రూపాయి జరిమానా కట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా `బాబ్రీ`తీర్పు నేపథ్యంలో ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.