న్యాయమూర్తులకు సలాం చెప్పిన ప్రకాశ్ రాజ్

Sun Jan 14 2018 02:53:55 GMT+0530 (IST)

 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పని విధానం సరిగా లేదంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకురావడాన్ని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సమర్థించారు. ‘గౌరవ న్యాయమూర్తుల్లారా సలాం.. కొందరు ఆత్మవంచన చేసుకోరు. జస్టిస్ లోయా కేసు నుంచి ఆధార్ కేసు వరకు కేంద్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నా నోరు మూర్చుకొని కూర్చోరు’ అని ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు సరైన దారిలో నడవడం లేదని ఈ విషయాన్ని తాము చూసి చూడనట్లు వ్యవహరించలేమని దేశ భవిష్యత్తు దృష్యా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నామని శుక్రవారం జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్న విషయాలను కూడా ప్రకాశ్‌రాజ్ ప్రస్తావించారు.మరోవైపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సమావేశమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నలుగురు సీనియర్ జడ్జీల లేఖపై సమావేశంలో చర్చించారు. నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు సంబంధించి కీలక తీర్మానాలు చేశారు. సీజేఐతో సీనియర్ జడ్జీలకు ఉన్న విభేదాలను సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం పరిశీలించాలి. అన్ని పిల్‌లను ప్రధాన న్యాయమూర్తి లేదా కొలీజియంలోని న్యాయమూర్తులు పరిశీలించారు. ఈ నెల 15న లిస్ట్ చేసిన పిల్‌లను వేర్వేరు బేంచ్‌ల నుంచి కొలీజియం సభ్యులైన జడ్జిల బెంచ్‌కు బదిలీ చేయాలని సూచించారు. అవసరమైతే ప్రధాన న్యాయమూర్తి ఇతర జడ్జీలతో చర్చించేందుకు బార్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు.

నలుగురు సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు నిన్న లేవనెత్తిన అంశాలను తమ ప్రతిపాదనలను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందిస్తే ఆ నలుగురు న్యాయమూర్తులతో చర్చలు జరుపుతామని అన్నారు. రెండు వైపుల నుంచి సానుకూల స్పందన వస్తే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని వికాస్ సింగ్ తెలిపారు. మరోవైపు ఈ సమస్య పరిష్కారానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులతో చర్చించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తుందని కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా చెప్పారు. మన న్యాయవ్యవస్థ గురించి మాట్లాడడానికి రాహుల్ గాంధీకి రాజకీయ నాయకులకు అవకాశం కల్పించడం దురదృష్టకరమని మిశ్రా అభిప్రాయపడ్డారు