Begin typing your search above and press return to search.

ఆమంచికి టైం బ్యాడ్‌.. చీరాల‌లో క‌ర‌ణందే పైచేయి.. వాట్ నెక్ట్స్‌?

By:  Tupaki Desk   |   31 July 2021 3:30 PM GMT
ఆమంచికి టైం బ్యాడ్‌.. చీరాల‌లో క‌ర‌ణందే పైచేయి.. వాట్ నెక్ట్స్‌?
X
ప్ర‌కాశం జిల్లా చీరాల వైసీపీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య జ‌గ‌డం తార‌స్థాయికి చేరింది. ఒక‌రిపై ఒకరు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేసుకుంటుండ‌డంతో.. నేత‌ల మ‌ధ్య వైరం రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో చీరాల రాజ‌కీయం ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల‌స‌ల‌మంటూనే ఉంది. దీంతో వైసీపీ అధికారంలో ఉన్న ప్ప‌టికీ.. చీరాల‌లో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోగా.. ఆసాంతం .. ప‌రిణామాలు ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిక‌ర‌గా మారాయి. విష‌యంలోకి వెళ్తే.. చీరాల రాజ‌కీయాల్లో గ‌డిచిన ప‌దేళ్లుగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ దూకుడుగా ఉన్నారు.

2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు రోశ‌య్య శిష్యుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అయితే.. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌.. ఒంట‌రిగా బ‌రిలోకి దిగారు. దీంతో 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. చంద్ర‌బాబు పిలుపుతో.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని విమ‌ర్శ‌లు చేసిన ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిపోయారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ వీచినా.. చీరాల‌లో మాత్రం ఆమంచి ఓడిపోయారు.

ఇక్క‌డ నుంచి పోటీ చేసిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి విజ‌యం ద‌క్కించు కున్నారు. అయితే.. రాజ‌కీయ స‌మీక‌ణ‌లో భాగంగా .. ఆయ‌న వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమంచి వ‌ర్గానికి క‌ర‌ణం వ‌ర్గానికి మ‌ధ్య వివాదాలు తార‌స్థాయిలో రేగుతున్నాయి. తాను స్థానికుడి ని క‌నుక‌.. త‌న మాటే నెగ్గాల‌నే ధోర‌ణితో ఆ మంచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. పార్టీలో తాను ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఉన్నాను క‌నుక‌.. త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. ఆమంచి వ‌ర్గం కోరుతోంది. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర‌ణంకు ప్రాధాన్యం ఇస్తోంది.

క‌ర‌ణం.. కోరుకున్న అధికారుల‌ను నియోజ‌క‌వ‌ర్గంలో నియ‌మించ‌డం.. తెలిసిందే. అదేవిధంగా.. స్థానిక ఎన్నిక‌ల్లో చీరాల మునిసిపాలిటిలో క‌ర‌ణం వ‌ర్గానికే వార్డు బీ ఫారాలు ఇచ్చారు. దీంతో ఆమంచి అలిగి.. ఏకంగా త‌న వ‌ర్గాన్ని రెబ‌ల్స్‌గా రంగంలోకి దింపారు. దీంతో క‌ర‌ణం వ‌ర్గంలోని 18 మంది. ఆమంచి వ‌ర్గంలోని 11 మంది గెలుపు గుర్రం ఎక్కారు. ఆత‌ర్వాత‌.. ఆమంచి కొంత మెత్త‌బ‌డి.. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ద్వారా మ‌చ్చిక చేసుకుని .త‌న వ‌ర్గానికి మ‌ళ్లీ వైసీపీ కండువాలు క‌ప్పించారు.

అయితే.. కీల‌క‌మైన చీరాల మునిసిపాలిటీ చైర్మన్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులు మాత్రం క‌ర‌ణం వ‌ర్గానికే ద‌క్కా యి. దీంతో ఆమంచి వ‌ర్గం రుస‌రుస‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర‌ణంకే చీరాల టికెట్ ఇచ్చే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోందని వైసీపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది. ఆమం చిని.. పొరుగున ఉన్న ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లాల‌ని.. కూడా అధిష్టానం ఇప్ప‌టికే సందేశం ఇచ్చింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. దీంతో అధిష్టానం ద‌గ్గ‌ర ఆమంచి పూర్తిగా మైన‌స్ అయిపోయార‌ని.. ఇక‌, ఆయ‌న చీరాల వ‌దిలి వేయ‌డం త‌ప్ప‌.. ఇంకేమీ.. ఛాన్స్ లేద‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారోచూడాలి.