Begin typing your search above and press return to search.

పవన్ చేతిలొ పవర్ ఫుల్ అస్త్రం... ?

By:  Tupaki Desk   |   27 Oct 2021 4:53 AM GMT
పవన్ చేతిలొ పవర్ ఫుల్ అస్త్రం... ?
X
పవన్ కళ్యాణ్ మళ్ళీ టూర్ వేస్తున్నారు. అది కూడా చాలా కాలం తరువాత ఉత్తరాంధ్రా జిల్లాలకు వస్తున్నారు. పవన్ పోటీ చేసిన గాజువాకలోనే ఆయన పర్యటన ఉంది. దాంతో రాజకీయ పార్టీలలో ఆసక్తి ఏర్పడుతోంది. మరో వైపు చూస్తే పవన్ మూడు రోజుల పాటు విశాఖలోనే మకాం వేస్తున్నారు. ఆయన ఎక్కడ తిరుగుతారు, ఏఏ అంశాలను ముందుకు తెస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉండగానే పవన్ తాజాగా ట్విట్టర్ లో అతి కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రా ఒడిషా బోర్డర్ గిరిజనుల గురించి ఆయన అందులో ప్రస్తావించారు. గతంలో తాను ఆయా ప్రాంతాలలో పర్యటించానని అక్కడ గిరిజనులు స్థితిగతులు తనకు తెలుసంటూ పేర్కొన్నారు. ఇక అక్రమ మైనింగ్, గంజాయి వంటి వంటివి ఏజెన్సీలో జోరుగా సాగుతున్నాయని పవన్ చెప్పడం బట్టి చూస్తూంటే ఆయన విశాఖ టూర్ మంటలు పెట్టేలాగానే ఉంది మరి.

ఇప్పటికే ఏపీలో గంజాయి మీద టీడీపీ పోరాటం చేస్తోంది. ఏపీలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల రవాణా సాగుతోంది అని కూడా ఢిల్లీ దాకా వెళ్ళి మరీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. ఇప్పటిదాకా గంజాయి గురించి కానీ మాదకద్రవ్యాల మీద కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదు. అలాంటి పవన్ ఇపుడు సడెన్ గా గిరిజన ప్రాంతాల గురించి ట్వీట్ చేయడం, అందులో ఈ విషయాలను తీసుకురావడం అంటే కచ్చితంగా ఆయన వీటిని వదిలిపెట్టరనే అంటున్నారు. పవన్ విశాఖ టూర్ లో అక్రమ గంజాయి రవాణా మీద బాంబులే పేలుస్తారు అంటున్నారు. విశాఖ ఏజెన్సీలో సాగుతున్నా ఈ గంజాయి సాగు మీద వాటి వెనక ఉన్న పెద్దల మీద కూడా పవన్ ఆస్త్రం ప్రయోగిస్తారని కూడా తెలుస్తోంది.

తెలుగుదేశం మాత్రమే ఈ అంశం మీద ఈ రోజు దాకా మాట్లాడుతోంది. ఇపుడు పవన్ కూడా తోడు అయితే ఏపీలో అక్రమ గంజాయి అన్నది హాట్ టాపిక్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఓవైపు టీడీపీతో జనసేన పొత్తులు ఉంటాయని వార్తలు వస్తున్న నేపధ్యం ఉంది, దానిని బలపరచేలా పవన్ కూడా అక్రమ గంజాయి ఇష్యూని టేకప్ చేస్తే కచ్చితంగా అధికార వైసీపీ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. అదే సమయంలో రెండు ప్రధాన పార్టీలు ఒకే అంశం మీద రోజుల తరబడి మాట్లాడితే అది కచ్చితంగా జనంలోకి చొచ్చుకుపోతుంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ విశాఖ ఏజెన్సీలో పెద్ద ఎత్తున సాగుతోంది అన్న ఆరోపణలను టీడీపీ చేస్తోంది.

ఇపుడు పవన్ కూడా తన గళం విప్పనున్నారు. పవన్ ఉత్తరాంధ్రా టూర్ లో ఇలాంటి కీలకమైన అంశాలను టచ్ చేస్తూ అజెండాని రూపొందించుకున్నారని అంటున్నారు. విశాఖ ఏజెన్సీలో వైసీపీ వైపే ఇప్పటిదాకా జనం ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయడానికి జనసేన ఈ అంశాలను ముందుకు తీసుకువస్తోందని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్ విశాఖ టూర్ మాత్రం ఆషామాషీగా ఉండబోదు అనే అంటున్నారు. ఆయన నోట అక్రమ గంజాయి మాట కనుక వస్తే దాని రియాక్షన్స్ వేరే లెవెల్లో ఉంటాయని కూడా చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో పవన్ టూర్ ఉండగానే పొలిటికల్ హీట్ అయితే గట్టిగానే ఉందని చెప్పాలి.