Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ‌ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమంగా ఉంటుంది : పోసాని !

By:  Tupaki Desk   |   21 Nov 2020 2:50 PM GMT
టీఆర్ఎస్ ‌ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమంగా ఉంటుంది : పోసాని !
X
జీహెచ్ ‌ఎంసీ ఎన్నికలపై ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి ఓట్లు వేసి , టిఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆంధ్రులు క్షేమంగా ఉన్నారని , ఆంధ్రా ప్రజలపై కేసీఆర్‌ కు ఏమాత్రం కోపం లేదని, కేవలం దోచుకున్న వారిపైనే కోపంతో ఉన్నారని , తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తమేనని అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమంగా ఉంటుందని అన్నారు.

తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని, కేసీఆర్‌ లాంటి పట్టుదల ఉన్న సీఎంను చూడలేదని , అయన సీఎం అయ్యాకనే రాష్ట్రంలో 24గంటలు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మించి రాష్టాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. అలాగే మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ పథకాలు చేపట్టారన్నారు. ‘ప్రస్తుతం దేశంలో ఉన్నవాళ్ళలో కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి. గతంలో హైదరాబాద్ లో మత కలహాలు యథేచ్ఛగా ఉండేవి.ఎన్టీఆర్ హయాంలో మత కలహాలు తగ్గాయి. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో హిందూ, ముస్లింలు మత సామరస్యంతో ఉంటున్నారని అన్నారు.

ఇక ఈ మద్యే వచ్చిన వరదలపై పోసాని స్పందిస్తూ ... హైదరాబాద్ ‌కు వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేరన్నారు. ఎప్పుడో వందేళ్ల క్రితం నిజాం పాలనలో వరదలు వచ్చి వందలాది మంది చనిపోయారని గుర్తుచేశారు. ఆనాటి 15లక్షల హైదరాబాద్ జనాభాను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారన్నారు. ఇప్పటికీ అదే డ్రైనేజీ వ్యవస్థ ఉందన్నారు. అయితే ప్రజలు,చోటా మోటా నేతలు చెరువులు,నాలాలను ఆక్రమించడం,ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ లాంటి వారు లక్ష మంది ఉన్నా కేంద్రమే జోక్యం చేసుకున్నా వరదలను ఎవరూ ఆపలేరని, కాబట్టి వరదలని ప్రభుత్వానికి అంటగట్టడం సమంజసం కాదని అన్నారు.

టీఆర్ ఎస్ పాలనలో శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, కమిషనర్ అంజనీ కుమార్,సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేత్రుత్వంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. దిశ ఎన్‌ కౌంటర్ పట్ల ప్రభుత్వం ఎలా స్పందించిందో ప్రతీ ఒక్కరూ చూశారని గుర్తుచేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.