చిరు నాకు ఏడుస్తూ ఫోన్ చేశాడు: పోసాని

Mon Mar 25 2019 10:28:53 GMT+0530 (IST)

Posani Krishna Murali Comments on Pawan kalyan and Nagababu

పోసాని కృష్ణ మురళి.. ఏ విషయంపైన అయినా చెడుగుడు ఆడుకునే రచయిత - దర్శకుడు.. ప్రస్తుతం ఎన్నికల సీజన్ వేళ రాజకీయ నేత అవతారం ఎత్తారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై పరుష విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. టీడీపీ కుట్రలు - కుతంత్రాలపై నిర్మోహమాటంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ పై కూడా పోసాని ఫైర్ అయ్యారు. ఇటీవల తెలంగాణ పాకిస్తాన్ లా మారిందని.. ఆంధ్రులపై తెలంగాణలో దాడులు చేస్తున్నారని పవన్ చేసిన విద్వేశ వ్యాఖ్యలను పోసాని ఖండించాడు. అంతేకాదు.. నీ రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రా తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని.. తెలంగాణలో తాము ఏ భయం లేకుండా జీవిస్తున్నామని పవన్ కు స్పష్టం చేశారు.

ఇక పవన్ గురించి మరో సంచలన నిజం బయటపెట్టాడు పోసాని. ప్రజారాజ్యం పార్టీ విషయంలో అన్న చిరంజీవికి పవన్ అన్యాయం చేశాడని పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణ చేశారు. ప్రజారాజ్యం రాజకీయాల్లో విఫలమయ్యాక.. ఆ పార్టీ కాడిని మధ్యలో వదిలేసిన వ్యక్తుల్లో పవన్ ఒకడని.. యువరాజ్యం బాధ్యతల నుంచి తప్పుకున్నాడని పోసాని ఆరోపించారు. చిరంజీవి మరో సోదరుడు నాగబాబు సైతం చిరును వదిలేశాడని పోసాని ఫైర్ అయ్యారు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యే వరకు తాను మాత్రమే ప్రజారాజ్యంలో కొనసాగానన్నారు. చిరు పార్టీ మూసేసే వరకు తాను ఆయనతోనే కలిసి సాగానని పోసాని వివరించాడు.

ప్రజారాజ్యం ఫెయిల్ అయిన సందర్భంగా చిరంజీవి ఎంతో మథన పడ్డాడని.. తనను - తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తట్టుకోలేక చిరంజీవి తనకు ఫోన్ చేసి ఏడ్చాడని.. ఇందుకు సాక్ష్యం మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అంటూ పోసాని సంచలన నిజాన్ని బయటపెట్టాడు. సొంత అన్నయ్యను మధ్యలో వదిలేసిన పవన్ వైఖరి ఇది అంటూ విమర్శలు గుప్పించాడు.