Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఓట‌మి!

By:  Tupaki Desk   |   26 March 2019 2:18 PM GMT
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఓట‌మి!
X
ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసింది. గ‌తంలో వ‌చ్చిన సీట్ల కంటే కూడా 20 సీట్లు అద‌నంగా సంపాదించిన టీఆర్ ఎస్... ఇక తెలంగాణ‌లో త‌న‌కు ఎదురే లేద‌న్న‌ట్లుగా జ‌బ్బ‌లు చ‌రుచుకుంది. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ త‌న‌కు తిరుగు ఉండ‌ద‌ని - రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్ల‌లో హైద‌రాబాద్ సీటును మ‌జ్లిస్‌ కు వ‌దిలేయ‌గా... మిగిలిన 16 సీట్ల‌లో త‌మ‌దే గెలుపు అన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. ఇదే మాట‌ను ఆ పార్టీ అధినేత‌ - సీఎం హోదాలో క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు కూడా ప‌దేప‌దే వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఇక‌పై తెలంగాణ‌లో జ‌రిగే ప్ర‌తి ఎన్నిక‌లోనూ త‌న‌కు ఎదురే లేద‌ని కూడా కేసీఆర్ చెబుతున్నారు. మొత్తంగా కారు పార్టీ జోరు మీదే ఉంద‌న్న క‌ల‌రింగ్ ఇచ్చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం విడుద‌లైన ఎమ్మెల్సీ ఫ‌లితాల్లో కారు జోరుకు బ్రేకులు ప‌డిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భాగంగా టీచ‌ర్స్ ఎమ్మెల్సీ కేట‌గిరీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగిన పూల ర‌వీంద‌ర్ అభ్య‌ర్థిత్వాన్ని టీఆర్ ఎస్ బ‌ల‌ప‌ర‌చింది. దీంతో ర‌వీంద‌ర్ న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న వాద‌న వినిపించింది. ర‌వీంద‌ర్‌ కు పోటీగా నిలిచిన యూటీఎఫ్ అభ్య‌ర్థి అలుగు బెల్లి న‌ర్సిరెడ్డి ఓటమి ఖాయ‌మేన‌న్న వాద‌నా వినిపించింది. అయితే ఫ‌లితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. ఇప్ప‌టికే కౌంటింగ్ పూర్తి కాగా అనూహ్యంగా ర‌వీంద‌ర్ ఓట‌మి పాలు కాగా.. న‌ర్సిరెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 18,885 ఓట్లు పోలవగా.... పూల రవీందర్ కు 6,279 ఓట్లు వచ్చాయి. 8,976 ఓట్లతో నర్సిరెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తంగా ఈ ఫ‌లితం టీఆర్ ఎస్ జోరుకు బ్రేకులేసింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.