Begin typing your search above and press return to search.

ఉత్త‌రాఖండ్ ఏమంటోంది?

By:  Tupaki Desk   |   19 Jan 2022 11:38 AM GMT
ఉత్త‌రాఖండ్ ఏమంటోంది?
X
దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. మ‌రికొన్ని రోజుల్లోనే విడ‌త‌ల వారీగా పోలింగ్ పోరు మొద‌ల‌వుతోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవాలో ఈ సారి అధికారం ఎవ‌రికి ద‌క్క‌తుందోన‌న్న చ‌ర్చ‌లు జోరందుకున్నాయి. వ‌చ్చే నెల 14న పోలింగ్ జ‌ర‌గ‌నున్న ఉత్త‌రాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కూడా వాడివేడి చ‌ర్చ సాగుతోంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం నిల‌బెట్టుకుంటుందా? లేదా కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది.

ఆయ‌న భ‌విష్య‌త్‌..

ఉత్త‌రాఖండ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు సాగిస్తున్నార‌ని సీనియ‌ర్ మంత్రి హ‌ర‌క్ సింగ్‌ను బీజేపీ ఆరేళ్ల పాటు నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఆయ‌న తిరిగి హ‌స్తం గూటికి చేరాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. కానీ ఆ ప్ర‌య‌త్నాల‌ను మాజీ ముఖ్య‌మంత్రి హ‌రీశ్ రావ‌త్ అడ్డుకుంటున్నార‌ని తెలిసింది. దీంతో హ‌ర‌క్ పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. 2016 వ‌ర‌కు కాంగ్రెస్ నేత‌గా ఉన్న హ‌ర‌క్‌.. అప్ప‌టి హ‌రీశ్ రావ‌త్ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రుస్తూ బీజేపీలోకి చేరారు. 2017 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ఆయ‌న‌కు బీజేపీ మంత్రి ప‌ద‌వి ఇచ్చింది. ఠాకూర్ వ‌ర్గానికి చెందిన హ‌ర‌క్‌కు ఎన్నిక‌ల ముందు పార్టీలు మార‌డం అల‌వాటే. గ‌త మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పార్టీలు మారారు.

వాళ్ల మ‌ధ్య పోటీ..

ఆ రాష్ట్రంలో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉండ‌నుంది. ఇప్ప‌టికే రెండు పార్టీల‌కు చెందిన అగ్ర‌నేత‌లు మాట‌ల యుద్ధం మొద‌లెట్టారు. గ‌త నెల‌లో అక్క‌డ భారీ బ‌హిరంగ స‌భ‌తో ప్ర‌ధాని మోడీ క‌మ‌ల ద‌ళంలో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా అక్క‌డ ర్యాలీలు నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఈ సారి ఎవ‌రికి విజ‌యం క‌ట్ట‌బెడ‌తార‌నే ప్ర‌శ్న‌కు ప్ర‌జ‌ల మౌనం స‌మాధానంగా నిలుస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను నేత‌లు విస్మ‌రించార‌న్న ఆగ్ర‌హం జ‌నాల్లో ఉంద‌ని చెబుతున్నారు. 2000లో కొత్త రాష్ట్రంగా ఉత్త‌రాఖండ్ ఏర్ప‌డి రెండు ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా ఇంకా చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌ని తెలిసింది. ఎన్నిక‌ల్లో హామీలు కురిపించే నాయ‌కులు వాటిని అమ‌లు మాత్రం చేయ‌డం లేద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నార‌ని స‌మాచారం.

మ‌ధ్య‌లో ఆప్‌..

నిరుద్యోగం, తాగునీరు, విద్య‌, వైద్యం, నాణ్య‌మైన ఆహార ధాన్యాల పంపిణీ, భూ కొనుగోళ్లు అమ్మ‌కం స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపాలని అక్క‌డి ప్ర‌జ‌లు ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మ‌రోవైపు ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు గ‌ట్టి పోటీనిచ్చేందుకు ఆప్ సిద్ధ‌మైంది. ఆ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ రాష్ట్రవ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఆ రాష్ట్రంలో అక్ష‌రాస్య‌త రేటు ఎక్కువ కాబ‌ట్టి విద్యావంతులైన ఓట‌ర్ల‌కు ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లిగే సామ‌ర్థ్యం ఉంది. అక్క‌డి జ‌నాభాలో మాజీ సైనికుల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. మ‌రోవైపు ప‌ర్వ‌త ప్రాంత‌మైన గైర్‌సైణ్‌ను రాష్ట్రానికి శాశ్వ‌త రాజ‌ధాని చేయాల‌నే డిమాండ్ ఉపందుకుంటోంది. రాష్ట్రంలో అధికంగా ఉన్న ఠాకూర్ జ‌నాభా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందోన‌నే చ‌ర్చ సాగుతోంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ బ‌లం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో చూడాలి.