ఇంటరెస్టింగ్ రిపోర్ట్ : ఓటర్ల కంటే రాజకీయ నాయకులకే అది ఎక్కువ...?

Sun Jun 26 2022 20:00:01 GMT+0530 (IST)

Politicians In World

ఓటేసే ఓటరన్న దేవుడు అని అంటారు. ఇక ప్రజాస్వామ్యంలో వారే అసలైన ప్రభువులు కూడా. ఇక సేవకుడు భక్తుడు ఎవరు అంటే నాయకుడే. కానీ చిత్రంగా దేవుడు లాంటి ఓటరు అర్ధాయుష్కుడుగా ఉంటే భక్తుడు లాంటి నాయకుడు మాత్రం మంచి ఆయుష్షుతో హాయిగా ఉంటున్నాడుట. ఇది ఎవరో మాట వరసకు చెప్పినది కాదు ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలు ఇవి.ఈ రకమైన అధ్యయనం చేయాలన్న  ఆలోచన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులకు తట్టింది. దాంతో వారు అతి పెద్ద కార్యక్రమాన్నే నెత్తికెత్తుకున్నారు. ఆ క్షణం నుంచే వారికి ఆసక్తికరమైన ఫలితాలు కూడా అందడం జరిగింది. ఒక ఏకంగా ఈ పరిశోధన  19వ శతాబ్దం మొదటి నుంచి ఇటీవల కాలం  వరకూ సాగడం విశేషం.

అలా ప్రపంచంలోని పదకొండు  దేశాలకు చెందిన 57 వేల 561 మంది రాజకీయ నాయకుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారని తెలిసింది. అయితే వీరిలో 40 వేల 637 మంది ఇప్పటికే చనిపోయారు. ఈ క్రమంలో వారి జీవిత కాలాన్ని  ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఆయుర్దాయం గణాంకాలను సేకరించి ఒక నివేదికను రూపొందించారు.  ఈ నివేదిక ఏం చెప్పిందంటే ఓటరన్న కంటే కూడా రాజకీయ నాయకుల సగటు ఆయుర్దాయమే ఎక్కువ అని. నిజంగా ఇది వింత అయినా నిజం ఇదేనట.

నిజానికి అనేక వత్తిడుల మధ్య రాజకీయ నాయకుల జీవితాలు ఉంటాయి. వారికి గుండెపోట్లు ఇతర వ్యాధులు సహజం అని అంతా అభిప్రాయపడతారు. కానీ జరిగేది వేరుగా ఉంది అంటున్నారు. వారి సగటు ఆయుస్షు 69 ఏళ్ళుగా నిర్ణయించారు. అయితే దేశం బట్టి ఇది కొంత మారినా కచ్చితంగా మాత్రం ఓటర్ కంటే నాలుగైదేళ్ళు ఎక్కువగానే రాజకీయ నాయకులు జీవిస్తున్నారు.

ఆయుష్షులో తేడా చూస్తే స్విట్జర్లాండ్ లో తక్కువగా మూడేళ్లు ఉండగా  యూకే నెదర్లాండ్స్ ఆస్ట్రేలియాలలో 3.5 ఏళ్లు ఆస్ట్రియా న్యూజిలాండ్ కెనడాలలో 4 ఏళ్లు జర్మనీలో 4.5 ఏళ్లు ఫ్రాన్స్ లో  6 ఏళ్లు అమెరికాలో 7 ఏళ్లు ఇటలీలో ఏడున్నరేళ్లు ఉందని ఈ కీలకమైన  నివేదిక పేర్కొంది.

దానికి కారణాలు ఏంటి అని అధ్యయనం చేస్తే వారి ఆర్ధిక పరిస్థితి పలుకుబడి వంటివి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతున్నాయని తెలుస్తోంది. వారికి ఏ రకమైన సమస్య వచ్చినా అత్యుత్తమైన వైద్య చికిత్స క్షణాలలో లభిస్తోంది. అది భారత్ అయినా మరో దేశం అయినా కూడా రాజకీయ నాయకుల జాతకం ఒక్కటిగానే ఉంటోంది.

ఇక మానసికంగా వారు చాలా ఆరోగ్యంగా సంతృప్తిగా ఉంటారని తేలింది. వారికి మంచి హోదా మంచి జీవితం ఉండడం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు. మొత్తానికి ఓట్లు వేసి పాలితులుగా మిగిలిపోతున్న సగటు జనాల కంటే కూడా వారిని పాలించే రాజకీయ నాయకులే ఎపుడూ ఫుల్ హ్యాపీ అన్న మాట. అది ఏ దేశమైనా కూడా వారు బాగానే ఉంటున్నారు అని అంటున్నారు. నిజంగా ఇది ఇంటరెస్టింగ్ అధ్యాయమే కదా.