Begin typing your search above and press return to search.

కొడాలి మీద కసికసిగా ...గుడివాడలో పొలిటికల్ గేమ్ స్టార్ట్

By:  Tupaki Desk   |   30 Sep 2022 9:48 AM GMT
కొడాలి మీద కసికసిగా ...గుడివాడలో పొలిటికల్ గేమ్ స్టార్ట్
X
కొడాలి నాని. ఈ పేరు మూడేళ్ళుగా బాగా పాపులర్ అయింది. ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా అవతరించారు. నిజానికి నాని 2004 నుంచి ఎమ్మెల్యేగా గుడివాడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. కానీ జగన్ క్యాబినెట్ లో మంత్రి అయ్యాకనే ఆయన పవర్ ఏంటో ఏపీ మొత్తం చూసింది. బూతుల మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నా ప్రత్యర్ధులను ముఖ్యంగా టీడీపీ అధినాయకుడు చంద్రబాబు, చినబాబు లోకేష్ మీద ఒంటి కాలు మీద లేచేందుకు ఆయన తెగ ఉత్సాహపడతారు.

అలాంటి కొడాలి నాని అన్ని హద్దులూ దాటేసి మరీ టీడీపీ అధినాయకత్వానికే పెను సవాల్ గా మారారు. చంద్రబాబు లాంటి ఏ రకమైన ఎమోషన్స్ ని బయటకు అసలు కనిపించనీయని నాయకుడి చేత కూడా నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో తొలిసారి కన్నీరు పెట్టించారు అంటే కొడాలి నాని టార్గెట్ ఏ రేంజిలో ఉందో అర్ధం చేసుకోవాల్సిందే.

నా వెనక జగన్ ఉన్నారు. ఆయన థర్టీ ఇయర్స్ సీఎం. నేను ఆయనతో పాటే మంత్రిని అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ నాని తెగ దూకుడు చేశారు. ఆ ఫలితాన్ని ఆయన మాజీ అయ్యాక చూస్తున్నారు. ఇపుడు నాని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు అంటున్నారు. అది వేరే విషయం అనుకున్నా ఇపుడే ఆయన ప్రత్యర్ధులు గట్టిగా గురి పెడుతున్నారు.

నానిని ఓడించాలి. ఆయన మాజీ కావాలి. గుడివాడలో పాతుకుపోయిన నానిని అక్కడ కదిలించి టీడీపీ జెండా ఎగరేసేలా చూడాలి. ఇదీ చంద్రబాబు పంతం. ఏపీలో 175 సీట్లు ఒక ఎత్తు అయితే కేవలం గుడివాడ మీదనే బాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. కొడాలి నానిని ఓడించేందుకు ఆయన ఇప్పటినుంచే తెర వెనక భారీ కసరత్తు చేసి ఉంచారు.

ఈసారి పవర్ ఫుల్ అభ్యర్ధినే ఆయన దించుతున్నారు. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అని వినిపిస్తోంది. ఆయన ఈ మధ్యనే నానీ నీవు ఈసారి మాజీవి అవుతావు అంటూ టీడీపీ సమావేశంలో తొడ కొట్టి మరీ చెప్పారు. దేవినేని ఉమను గుడివాడలో దింపడం ద్వారా ఆయన వైపు ఉన్న కమ్మ సామాజికవర్గం ఓట్లను లాగేయాలని, అదే టైం లో టీడీపీకి ఉన్న బీసీ ఓటు బ్యాంక్ తో గట్టెక్కాలని భారీ స్కెచ్ ని టీడీపీ గీస్తోంది.

మరో వైపు చూస్తే జనసేనతో పొత్తు ఉన్నా కూడా ఈ సీటుని టీడీపీ తీసుకోవాలని అనుకుంటోందిట. ఇక పవన్ కి కూడా నాని అంటే వ్యతిరేకత ఉంది. పవన్ని కూడా ఏమీ కాకుండా చాలా సార్లు నాని విమర్శించారు. దాంతో పవన్ కూడా కొడాలి నానికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇపుడు కనుక పట్టుదలగా టీడీపీ నిలబడితే జనసేన కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని అంటున్నారు.

అయితే గుడివాడ సీటుని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర‌రరావు సంగతి ఏంటి అన్న చర్చ ఉంది. రావికి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం కోరుతోంది. అదే టైం లో తన సొంత సీటుని వదిలేసి దేవినేని ఉమ గుడివాడ వెళ్ళినా అక్కడ గెలుస్తారా అన్న డౌట్లు ఉన్నాయి. ఇక పాతికేళ్ళుగా నాని పాతుకుని పోయారు. ఆయనకు ఎన్నికల వ్యూహాలు బాగా తెలుసు. ఆయన కేవలం కమ్మ ఓట్లతోనే గెలవడం లేదు. మిగిలిన వర్గాల మద్దతు కూడా ఆయనకు ఉంది. దాంతో నానిని ఓడించాలన్న టీడీపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా అంటే చూడాలి. ఏది ఏమైనా కొడాలి వర్సెస్ దేవినేని అంటేనే ఈ పొలిటికల్ ఫైట్ ఏపీ రాజకీయాలో కిక్ ఇస్తుందని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.