Begin typing your search above and press return to search.

వైరల్ గా ‘భగత్ సింగ్’ హోర్డింగ్... ఉద్రిక్తతల మధ్య తొలగింపు

By:  Tupaki Desk   |   11 Aug 2020 5:30 PM GMT
వైరల్ గా ‘భగత్ సింగ్’ హోర్డింగ్... ఉద్రిక్తతల మధ్య తొలగింపు
X
ఏంటేంటీ... భగత్ సింగ్ పేరిట వెలసిన హోర్డింగ్ పై వివాదాలు ముసరడమేమిటి? దానిని ఉద్రిక్తతల మధ్య తొలగించడమేమిటి? అనుకుంటున్నారా? మనది లౌకిక రాజ్యం కదా. దేనిపై అయినా ఎవరైనా ఫిర్యాదు చేసే హక్కు ఉంది. ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతినకూడదన్న రీతిలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోకా తప్పడం లేదు. ఇలాంటి వ్యవహారాలు రెండు మతాలకు చెందిన వర్గాల మధ్య తలెత్తితే... అది మరింత సున్నితమైన సమస్యే కదా. అందుకే... భాగ్యనగరిలో భగత్ సింగ్ యువ సేన పేరిట వెలసిన ఓ భారీ హోర్డింగ్ ను హైదరాబాద్ పోలీసులు తొలగించక తప్పలేదు. ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... సదరు హోర్డింగ్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ల ఫొటోలు ఉన్నాయి. అంతేకాదండోయ్ సదరు హోర్డింగ్ లో ఈ మూడు ఫొటోలే ప్రధానంగా కనిపిస్తుండగా... ఇంకో ఫొటో భగత్ సింగ్ యువసేనకు చెందిన లడ్డూ యాదవ్ ది మాత్రమే. అంటే నాలుగంటే నాలుగు ఫొటోలున్న ఈ హోర్డింగ్ లో మూడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన వారి ఫొటోలేనన్న మాట.

అయినా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం ఉన్న సదరు హోర్డింగ్ ను పోలీసులు ఎందుకు తొలగించారు? దాని వెనకున్న సంగతి ఏమిటన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలైపోయింది కదా. యావత్తు దేశం ఆసక్తిగా తిలకించిన రామ మందిరం భూమి పూజలో స్వయంగా మోదీ పాలుపంచుకోగా... ఇతర దేశాల్లోని హిందువులు కూడా కన్నార్పకుండా సదరు కార్యక్రమాన్ని తిలకించారు. సరే. ఎలాగూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ కార్యక్రమం జరిగిపోగా... మరో నాలుగు రోజుల్లో స్వాతంత్య్రదినం వస్తోంది కదా. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజా సింగ్ లకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూనే... అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఝతలు చెబుతూ లడ్డూ యాదవ్ సదరు హోర్డింగ్ ను నగరంలోని మొజాం జాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేశారు. మొజాం జాహి మార్కెట్ ఏరియా అంటేనే... ఓ వైపు ముస్లింలు, మరోవైపు హిందువులు ఉండే ప్రాంతం కదా. ఈ హోర్డింగ్ వెలసిన మరుక్షణమే ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

సదరు హోర్డింగ్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని, తక్షణమే దానిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అంజదుల్లా నేరుగా మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపీలతో పాటు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మరికొన్ని రోజుల్లో జరగనున్నమొహర్రం, గణేశ్ చతుర్ధి సందర్భంగా ఈ హోర్డింగ్ కారణంగా అల్లర్లు చెలరేగే ప్రమాదముందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు... హిందువులకు చెందిన ఇలాంటి వ్యవహారాలపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో సామాజిక కార్యకర్త సయ్యద్ అబ్దాహు కసఫ్ కూడా ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం రాత్రి ఈ హోర్డింగ్ ను తొలగించేందుకు సన్నద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న లడ్డూ యాదవ్ పోలీసులను అడ్డుకునేందుకు రాగా..ఆయనను పక్కకు నెట్టేసిన పోలీసులు హోర్డింగ్ ను తొలగించేశారు.