Begin typing your search above and press return to search.

ఇదెక్కడి న్యాయం: అనేక మలుపులు తిరిగిన అన్సారీ కేసు...

By:  Tupaki Desk   |   11 Sep 2019 2:30 PM GMT
ఇదెక్కడి న్యాయం: అనేక మలుపులు తిరిగిన అన్సారీ కేసు...
X
గత జూన్ నెలలో ఝార్ఖండ్‌ కు చెందిన 22 ఏళ్ల తబ్రేజ్‌ అన్సారీ యువకుడు ఓ మూక దాడిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ నిందితులని తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...ఝార్ఖండ్‌ రాష్ట్రం సెరాయ్‌ కెలా–ఖర్సావన్‌ జిల్లా ధక్తీదీహ్‌ గ్రామంలో జూన్‌ నెలలో తబ్రేజ్‌ అన్సారీ అనే యువకుడు బైక్ దొంగతనం చేశాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఓ స్తంభానికి కట్టేశారు.

అలాగే జైశ్రీరామ్‌ - జై హనుమాన్ అని నినదించాల్సిందిగా బలవంతం చేశారు. అందుకు అతడు నిరాకరించడంతో - చితక్కొట్టారు. అయితే చివరికి ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేసినప్పటికీ ఆ గ్రామ మూక వదిలి పెట్టకపోవడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డారు. ఇక గాయపడిన అన్సారీని పోలీసులకు అప్పగించారు. నాలుగురోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తర్వాత అన్సారీ తీవ్రగాయాలతో బాధపడుతుండటంతో హాస్పిటల్‌కు చికిత్స కోసం పంపారు.

కానీ అన్సారీ చికిత్స పొందుతూ హాస్పిటల్ లోనే మృతి చెందాడు. తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల మెదడులోని రక్తనాళాలు చిట్లి అన్సారీ మరణించాడని హాస్పిటల్ వర్గాలు మీడియాకు స్పష్టంగా చెప్పారు. దీంతో అన్సారీని కట్టేసి చితకబాదిన 11 మంది నిందితులపై పోలీసులు ఐపీసీ 302 సెక్షన్‌ కింద హత్య కేసును నమోదు చేశారు. మళ్ళీ తర్వాత అన్సారీని హత్య చేయాలనే ఉద్దేశం నిందితులకు లేదని - అనుకోని పరిస్థితులు హత్యకు దారి తీశాయని చెబుతూ పోలీసులు.. నిందితులపై 302 సెక్షన్‌ ను తొలగించి 304 సెక్షన్‌ ను నమోదు చేశారు.

ఇక మూడు నెలల తర్వాత తాజాగా అన్సారీ దెబ్బల మూలంగా కాకుండా గుండెపోటుతో మరణించినట్లు ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది. దీంతో పోలీసులు 11 మంది నిందితుల పేర్లను చార్జ్‌ షీట్‌ నుంచి తొలగించారు. అయితే దాడి కారణంగా చనిపోయినా..పోలీసులు నిందితుల పేర్లని చార్జ్ షీట్ నుంచి తొలగించడంపై ఆ రాష్ట్రంలోని ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.