Begin typing your search above and press return to search.

మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసు: అజ్ఞాతంలో రెడ్డెప్ప

By:  Tupaki Desk   |   16 Feb 2020 4:56 PM GMT
మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసు: అజ్ఞాతంలో రెడ్డెప్ప
X
మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసు మలుపులు తిరుగుతోంది. చిన్నమండెం మండలం కేశాపురానికి చెందిన రెడ్డెప్ప అనే వ్యక్తి కడప-బెంగళూరు మెయిన్ రోడ్డులో 1.26 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ భూకేటాయింపుకు సంబంధించి మంత్రి వనిత జిల్లా కలెక్టర్‌ కు సిఫార్సు చేసినట్లు ఉన్న లేఖను రెడ్డెప్ప తహసీల్దారుకు అందించారు. అయితే ఆ భూమిని అప్పటికే గ్రామ సచివాలయం నిర్మించేందుకు కేటాయించారు. ఆ లేఖ విషయం వెలుగుచూడగా.. ఆ సంతకం తనది కాదని - ఫోర్జరీ చేశారని మంత్రి..డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో రెడ్డెప్పపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ ఆ సంతకం అసలుదేనని రెడ్డెప్ప పోలీసులకు ఫోన్ ద్వారా వెల్లడించారు.

ఐతే రెడ్డెప్ప ఆచూకీ మాత్రం తెలియరాలేదు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. రెడ్డెప్ప అనుచరుడైన కిరణ్‌ ను పోలీసులు శుక్రవారం విచారించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన కిరణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విచారణ సమయంలో అతని కుటుంబ సభ్యులు - బంధువులు పోలీస్ స్టేషన్ వెళ్లి.. అతనికేం సంబంధం లేదని విజ్ఞప్తి చేసినా రాత్రి కూడా స్టేషన్‌ లో ఉంచి విచారించారట. శనివారం మధ్యాహ్నం అతనిని గ్రామంలో వదిలేశారు.

మనస్తాపానికి గురైన కిరణ్ విషం తాగాడు. పోలీసులకు సమాచారం అందించడంతో రాయచోటి ఆసుపత్రికి తరలించారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసులు తన భర్తను తీవ్రంగా వేధించారని - అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కిరణ్ భార్య కృష్ణవేణి మీడియా ముందు కన్నీరుమున్నీరు అయ్యారు. ఐతే తాము అతనిని విచారించామని - కానీ వేధించలేదని పోలీసులు చెబుతున్నారు.

రెడ్డెప్ప చిన్నమండెం కేశాపురంలో టీడీపీకి బలమైన నాయకుడు. వారి కుటుంబ సభ్యులు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 1648/3లోని 1.26 ఎకరాల ప్రభుత్వ భూమిలో చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు కోసం తనకు స్థలం కేటాయించాలని మంత్రి వనితకు విజ్ఞప్తి చేశాడు. ఆమె ఇచ్చిన సిఫార్సు లేఖనే తాను అధికారులకు ఇచ్చానని రెడ్డెప్ప చెబుతుండగా - అది ఫోర్జరీ సంతకమని మంత్రి చెబుతున్నారు. పోలీసులు ఈ కేసును చేధించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.

మరోవైపు, ఈ కేసులో రెడ్డెప్పతో సంబంధాలు ఉన్న మాజీ ఎంపీటీసీ సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెడ్డెప్ప గురించి ఆరా తీస్తున్నారు. రెడ్డెప్ప - కిరణ్ - మాజీ ఎంపీటీసీ సభ్యులు ఫోన్లో మాట్లాడుకున్న వివరాలపై ఆరా తీశారని తెలుస్తోంది. రెడ్డెప్ప - కిరణ్‌ లు ఓ డ్రిప్ కంపెనీలో ఏజెంట్లుగా పని చేసేవారని తేలడంతో ఆ పరికరాల కొనుగోళ్లు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారని సమాచారం.