Begin typing your search above and press return to search.

కేటీఆర్ పీఏనంటూ 6 లక్షలు స్వాహా !

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:14 AM GMT
కేటీఆర్ పీఏనంటూ 6 లక్షలు స్వాహా  !
X
ఈ మధ్య కాలంలో ప్రముఖుల పేర్లు చెప్పి ..ఎదుటివారిని నమ్మించి వారి నుండి డబ్బుని స్వాహా చేసే వారు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి మోసాలలో పడకండి అని ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ప్రముఖుల గురించి పూర్తిగా తెలుసుకొని , వారికీ నమ్మకం వచ్చేలా చెప్పడంతో వారు కూడా నిజమైన వారేమో అని నమ్మి డబ్బు ఇచ్చేస్తున్నారు. ఆ తరువాత మోసపోయామని తెలుసుకొని సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అలాంటి ఘరానా మోసమే మరొకటి బయటకి వచ్చింది. మంత్రి గారి పీఏ నంటూ నమ్మబలికి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుండి సుమారుగా 6 లక్షల వరకు స్వాహా చేసాడు. ఇంతకీ ఆ మోసగాడు ఎవరి పేరుని ఉపయోగించుకున్నారో తెలుసా ..తెలంగాణ మంత్రి కేటిఆర్ పేరు. మొన్న ఆ మధ్య కేటీఆర్ పేరు చెప్పుకొని మోసాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ విషయం పై పూర్తి వివరాలు చూస్తే .. మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు మోసాలు ప్రరంభించాడు. నగరానికి చెందిన ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థ సీఎండీకి గతేడాది డిసెంబర్‌ 26న ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి తిరుపతిని మాట్లాడుతున్నానంటూ అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన నాగరాజు అనే యువకుడు క్రికెట్‌ లో ప్రతిభ కనబరుస్తున్నాడని, ఇంగ్లాండ్‌లో జరిగే అండర్‌–25 వరల్డ్‌ కప్‌కు సెలెక్ట్‌ అయ్యాడని , ఈ టోర్నీతో పాటు 20–20 సన్‌రైజ్‌ టీమ్‌కూ ఎంపికయ్యాడని, నాగరాజు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని అన్నాడు. అతడికి క్రికెట్‌ కిట్‌ తో పాటుగా లండన్‌ టూర్‌ ఖర్చులకు స్పాన్సర్‌షిప్‌ అవసరం ఉందని, అందుకు రూ.3.3 లక్షలు ఖర్చవుతాయన్నాడు. ఇదంతా విన్న సదరు సీఎండీ పూర్తిగా తన మాటల వల్లో పడ్డారని మోసగాడు నిర్థారించుకున్నాడు. దీంతో స్పాన్సర్‌షిప్‌ నగదును డిఫాజిట్ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్‌ ఇచ్చాడు. ఈ టోర్నీకి సంబంధించిన క్రికెట్‌ కిట్‌ను నాగరాజు బెంగళూరులో మీ కంపెనీ పేరుతోనే ప్రింట్‌ చేయిస్తున్నాడని, దాన్ని కేటీఆర్‌ చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో, మీడియా సమక్షంలో అందుకుంటాడని తెలిపారు. ఇది మీ కంపెనీ కి మంచి పబ్లిసిటీ ఇస్తుందంటూ బాగా నమ్మించాడు.

అతడి మాటల్ని అనుమానించిన ఆ సంస్థ ప్రతినిధులు తొలుత సందేహించారు. తమకు కాల్‌ వచ్చిన ఫోన్‌ నంబర్‌ను ట్రూ కాలర్‌ యాప్‌లో తనిఖీ చేయగా అందులో తిరుపతి అనే పేరే కనిపించింది. దీంతో అతడు కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి అనే నమ్మిన సంస్థ నగదును గతేడాది డిసెంబర్‌ 27న ఆంధ్రప్రదేశ్‌లోని నర్సన్నపేట కెనరా బ్రాంచ్‌ శాఖలో ఉన్న ఖాతాకు బదిలీ చేసింది. ఇది జరిగిన వారం తర్వాత సంస్థ ప్రతినిధులు తిరుపతిగా చెప్పుకున్న వ్యక్తిని ఫోన్‌ ద్వారా సంప్రదించి కేటీఆర్‌ కార్యక్రమంపై ఆరా తీశారు. దీంతో ఆయన ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో హడావుడిగా ఉన్నారని, ఆ తరువాత ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పడంతో మళ్లీ అతడి మాటలు నమ్మాడు.

ఈ నెల 10న ఆ సంస్థ ప్రతినిధులకు మరోసారి ఫోన్‌ చేసిన అతడు.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని నమ్మబలికాడు. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఎల్బీ స్టేడియం లో కేటీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పాడు. ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌ గా మీ సంస్థనే సార్‌ ఎంపిక చేశారంటూ మరో ఎర వేశాడు. ఆపై మా బంధువు ఒకరు రాజ మండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, బిల్లుల కోసం రూ.2 లక్షలు సాయం చేయాలని కోరాడు. రాజమండ్రిలోని ఎస్‌బీఐ శాఖలో అప్పలనాయుడు పేరుతో ఉన్న ఖాతా వివరాలను పంపాడు. దీంతో అనుమానం వచ్చిన సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా తాము మోసపోయామని గ్రహించారు. దీంతో వారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు చేశారు. ఫోన్‌ నంబర్లు, డబ్బు డిఫాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో 2014–16 మధ్య ఆంధ్రప్రదేశ్‌ తరఫున రంజీ జట్టులో ఎంపికైన ఓ వ్యక్తి పనిగా అనుమానిస్తున్నారు. అలాగే అతడు ఇప్పటికే ఇదే విదంగా పలువురి ప్రముఖుల పేర్లని ఉపయోగించుకొని పెద్ద మొత్తం లో రాబట్టినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.