Begin typing your search above and press return to search.

దివ్య హత్య కేసు: ఎవరికీ దక్కకూడదనే హతమార్చిన వెంకటేష్

By:  Tupaki Desk   |   21 Feb 2020 3:59 AM GMT
దివ్య హత్య కేసు: ఎవరికీ దక్కకూడదనే హతమార్చిన వెంకటేష్
X
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగిని దివ్యను హతమార్చింది తానేనని వేములవాడకి చెందిన వెంకటేష్ అంగీకరించినట్లు గజ్వెల్ ఏసీపీ నారాయణ తెలిపారు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు. ఆమె హత్యకు సంబంధించిన కేసు వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

వెంకటేష్ - దివ్య ఒకే స్కూల్లో చదువుకున్నారు. వారి మధ్య సాన్నిహిత్యం ఉంది. దివ్య ఉద్యోగ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ప్రేమిస్తున్నానని - పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు బ్యాంకు ఉద్యోగం వచ్చింది. అతనిని దూరం పెట్టింది. దీంతో వెంకటేష్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదని ఈ నెల 18న దివ్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేష్ ఆమెపై దాడి చేశాడు.

తన వెంట తెచ్చుకున్న కత్తితో దివ్య గొంతు కోసి - శరీరంపై పొడిచి చంపేశాడు. హత్య చేసిన తర్వాత సికింద్రాబాద్ మీదుగా విజయవాడ వెళ్లి - అక్కడి నుండి వరంగల్ మీదుగా వేములవాడకు వచ్చాడు. మెడ నరికి పదిహేను పోట్లు పొడిచాడు. దివ్యను వెంకటేష్ హతమార్చినట్లుగా మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేష్ కోసం గాలించారు. బుధవారం రాత్రి వేములవాడలో అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నాడు.

కాగా, విచారణలో వెంకటేష్ పలు విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.తనను కాదని దివ్య ఈ నెల 26న పెళ్లి చేసుకోబోతుండటంపై కూడా కోపం పెంచుకున్నట్లుగా చెప్పాడని తెలుస్తోంది. దివ్య తాను ఇంజినీరింగ్ సమయంలోనే ప్రేమించుకొని - రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడట. దివ్యకు ఓయూలో సీటు వస్తే తాను చదివించినట్లు పోలీసుల విచారణలో చెప్పాడని తెలుస్తోంది.

అంతేకాదు, తమకు కొడుకు ఉన్నాడని, అతను దిల్‌ సుఖ్ నగర్‌ లో ఉన్నాడని - ఏడాదిన్నరగా తాము దూరంగా ఉంటున్నామని - అంతకుముందు కలిసి ఉండేవారమని చెప్పాడని తెలుస్తోంది. మరొకరితో చనువుగా ఉండటం - పెళ్లికి సిద్ధమవడం వల్లే హతమార్చినట్లుగా పోలీసుల విచారణలో చెప్పాడని సమాచారం.