Begin typing your search above and press return to search.

కేసీఆర్ బాటలోనే ప్రధానమంత్రి మోదీ

By:  Tupaki Desk   |   20 Feb 2020 4:30 PM GMT
కేసీఆర్ బాటలోనే ప్రధానమంత్రి మోదీ
X
ప్రధానమంత్రి కొన్ని విషయాల్లో కేసీఆర్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలనే కాపీ కొట్టి వాటి పేర్లు మార్చి అమలు చేస్తున్నారు. అందులో ఒకటి రైతులకు పెట్టుబడి సహాయం అందించే పథకం రైతుబంధు. దీనినే కేంద్రం మరో పెట్టి దేశవ్యాప్తంగా అమలుచేస్తోంది. దీంతో పాటు ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మరో పేరుతో తీసుకొచ్చి అమలుచేయనుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ మరో విషయంలో కేసీఆర్ ను అనుసరిస్తున్నారు. ఆ విషయమేమంటే..

ప్రపంచ పారిశ్రామిక వేత్తల శిఖరాగ్ర సదస్సు 2017 నవంబర్ 28-30 తేదీల్లో భారతదేశంలోనే తొలి సారిగా హైదరాబాద్ లో నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకం గా జరిగిన ఈ సమావేశానికి ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హాజరయ్యారు. అయితే ఈ సదస్సు సందర్భంగా హైదరాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయి. హైదరాబాద్ రోడ్లు ఆ సమయంలో తళతళ మెరిశాయి. పారిశుద్ధ్య సమస్య లేదు. కాల్వలు, పైపులైన్ లు, డ్రైనేజీలు పొంగి ప్రవహించలేదు. ముఖ్యంగా సదస్సు జరిగిన హెచ్ఐసీసీ తదితర ప్రాంతాల్లో కోట్లు కుమ్మరించి అభివృద్ధి పనులు చేశారు. అసలు దాన్ని చూసిన హైదరాబాద్ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. మసిపూసి మారేడుకాయలాగా హైదరాబాద్ ను అందంగా తీర్చిదిద్దారు. ఆ ఏర్పాట్లను చూసిన ప్రజలు తమ ప్రాంతానికి కూడా ఇవాంక వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని వ్యంగ్యం వ్యాఖ్యానించారు. ఆ ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హైదరాబాద్

అంతటా అభివృద్ధి పనులు చేయొచ్చు కదా పెద్ద ఎత్తున ప్రజలు కోరారు. చివరకు ఆ సమావేశం అట్టహాసంగా ముగిసింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ముచ్చటపడ్డారు. ఇప్పుడు వాటినే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్నాడు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు విచ్చేస్తున్నాడు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నాడు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ లో చేసినట్టు ఏర్పాట్లు అహ్మదాబాద్ లో జరుగుతున్నాయి. అప్పటికప్పుడే పనులు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ అందంగా రూపుదిద్దుకుంటుంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బస్తీలు కనిపించకుండా ఒక పెద్ద గోడ కట్టేశారు. బస్తీలను ఖాళీ చేయాలని తెలిపారు. అకస్మాత్తుగా అహ్మాదాబాద్ నగరం అభివృద్ధి చెందుతోంది. ట్రంప్ పర్యటన లో సమస్యలు ఏమీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ పనులను చూసి అహ్మదాబాద్ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నగరం అంతా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ పనుల తీరుపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే గతంలో ఇవాంకాకు ఆహ్వానం పలికిన వ్యక్తే ఇప్పుడు ఆమె తండ్రి ట్రంప్ నకు ఆతిథ్యం ఇవ్వనుండడం గమనార్హం.

ఎవరైనా అతిథులు వస్తేనే అభివృద్ధి పనులు చేస్తారా అని నిలదీస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు పరిష్కరించారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం లో మోదీ అయినా, కేసీఆర్ అయినా మరో ముఖ్యమంత్రి అయినా అంతే. అతిథులకు రాచమర్యాదలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సాధారణమే.