యువనేతపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు ఎందుకు?

Thu Oct 29 2020 10:45:10 GMT+0530 (IST)

Pm Modi Fires On Tejaswi Yadav

ఓవైపు పోలింగ్ జరుగుతున్న వేళ.. మరోవైపు ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా సాగుతున్న వేళ.. ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సరిగ్గా ముప్ఫై ఏళ్ల యువకుడు.. ఆ మాటకు వస్తే మోడీ రాజకీయ అనుభవం అంత వయసు లేని యువ నేతపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోడీ లాంటి పవర్ ఫుల్ నేత నోటి నుంచి ఆర్జేడీకి అన్ని తానై వ్యవహరిస్తున్న తేజస్వి యాదవ్ పై ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. జంగిల్ రాజ్ కు ఆయన యువరాజు అంటూ తీవ్రంగా విరుచుకుపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఆర్జేడీ దూకుడే అని చెప్పక తప్పదు.బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ బుధవారం షురూ అయ్యింది. ఓవైపు రాష్ట్రంలోని ఒక వైపు పోలింగ్ జోరుగా సాగుతుంటే.. మరోవైపు ఎన్నికల ప్రచారాన్నినిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా రాష్ట్ర రాజధాని పాట్నాతో పాటు ముజఫర్ నగర్.. దర్భంగాలలో ఏర్పాటు చేసిన ప్రచార సభలకు హాజరైన ప్రధాని మోడీ.. తేజస్వి యాదవ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే.. యువ నేతపై గురి పెట్టారని చెప్పాలి. అతడిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. మరోవైపు మిత్రుడు నితీశ్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

తాము పవర్ లోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ తేజస్వి చేస్తున్న ప్రచారం అధికారపక్షంలో కొత్త గుబులును రూపుతోంది. అందుకే.. అదే అంశాన్ని ప్రధానంగా చేసుకున్న ప్రధాని మోడీ.. తాము తిరిగి పవర్లోకి వస్తే.. కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై హామీ ఇవ్వలేదు. అదే సమయంలో.. తేజస్వి ఇస్తున్న హామీపై తీవ్రంగా స్పందించారు.

వాళ్లు గెలిస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల సంగతి తర్వాత..ఇప్పటికే ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు పోతాయన్నారు. ఆ పార్టీ కిడ్నాపింగ్ లకు కాపీ రైట్ తెచ్చుకుంది. బెదిరింపులతో కంపెనీలన్ని మూతపడతాయి.. అవన్నీ వేరే చోటుకు వెళ్లిపోతాయని మండిపడ్డారు. అంతేకాదు.. తేజస్విని ఉద్దేశించి.. అతగాడు జంగిల్ రాజ్ కు యువరాజుగా అని వ్యాఖ్యానించారు. మోడీ లాంటి నేత నోటి నుంచి తేజస్విపై ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటే.. బిహార్ ఎన్నికల్లో అతగాడు చూపిస్తున్న ప్రభావమేనని చెప్పక తప్పదు. ప్రధాని మోడీ నేరుగా తేజస్విని టార్గెట్ చేయటంపై ఆర్జేడీలో ఒకింత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు చెబుతున్నారు. మరి.. బిహార్ ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.