దయచేసి.. తెలుగుదేశానికి ఓటు వేయకండిః టీడీపీ నేతల ప్రచారం

Thu Apr 08 2021 11:07:51 GMT+0530 (IST)

Please do not vote for Telugu Desam

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ. ఆ ఊరిలో ఓ ఆటో ఎన్నికల ప్రచారం కోసం తిరుగుతోంది. అది తెలుగుదేశం పార్టీ అద్దెకు తీసుకున్న ఆటో. అందులో ఓ వ్యక్తి మైక్ పట్టుకొని కూర్చొని ‘దయచేసి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి. దయ చేసి వినండి..’ అంటూ చెప్పుకుంటూ పోతున్నాడట. ఇది విన్న వారికి కాసేపు ఏమీ అర్థంకాక నెత్తిగోక్కున్నారు.సహజంగా ఎన్నికల ప్రచారం అంటే.. ఎవరైనా తమ పార్టీకి ఓటు వేయమని కోరుతారు. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయొద్దని కూడా అంటారు. కానీ.. సొంత పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దని ఎవరైనా కోరుతారా? అధికారికంగా ప్రచారం చేస్తారా? బహుశా రాష్ట్రచరిత్రలో ఇలా ఎప్పుడూ జరగకపోవచ్చు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దంటూ ఆ పార్టీ నేతలే ప్రచారం చేస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది.

విషయం ఏమంటే.. తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికిముందే పలువురు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో.. టీడీపీ అభ్యర్థులు బరిలో నిలినట్టైంది.

ఆ తర్వాత ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించినప్పటికీ.. అభ్యర్థుల గుర్తు బ్యాలెట్ లో ఉండనుంది. అందువల్ల.. ఎవరైనా ఓటు వేస్తారేమోనని ఓ ఆటో కట్టించుకొని దానికి మైకు తగిలించుకొని మరీ తమ అభ్యర్థులకు ఓటు వేయొద్దంటూ ప్రచారం చేశారు టీడీపీ నేతలు! ఇది చూసిన జనాలు ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు.