Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక‌.. ఇంత ప్లాన్ ఉందా? బీజేపీలో గుస‌గుస‌

By:  Tupaki Desk   |   21 May 2022 10:30 AM GMT
కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక‌.. ఇంత ప్లాన్ ఉందా?  బీజేపీలో గుస‌గుస‌
X
ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం చేసినా.. దాని వెనుక ఒక రీజ‌న్‌.. సంద‌ర్భం.. స‌మ‌యం ఖ‌చ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఆయ‌న ఢిల్లీ టూర్ వెనుక కూడా ఇదే రీజ‌న్‌.. ఇదే స‌మ‌యం.. ఇదే సంద‌ర్భం ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇదే విష‌యంపైబీజేపీ నాయ‌కులు కూడా గుస‌గుస‌లాడుతున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు వెళ్లారు. ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు ఆయ‌న వివిధ రాష్ట్రాల్లో(ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క, యూపీ) ప‌ర్య‌టించి తీరిగ్గా 27న రాత్రి హైద‌రాబాద్‌కు చేరుకుంటారు.

అయితే.. దీనికి వంక పెట్టాల్సిన అవ‌స‌రం ఉందా?  అంటే.. పైకి మాత్రం లేద‌నే చెప్పాలి. కానీ, ఒక్క‌సారి కేసీఆర్ వ్యూహాన్ని క‌నుక ప‌రిశీలిస్తే.. ఔన‌న‌క త‌ప్ప‌ద‌నే అంటారు. ఎందుకంటే.. ఈ వారం లోనే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. దీంతో ప్రొటోకాల్ ప్ర‌కారం.. సీఎం కేసీఆర్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌కాలి. ఎందుకంటే.. అది అధికారిక ప‌ర్య‌ట‌న‌. అంతేకాదు.. ప్ర‌ధాని వెంటే ఉండాలి. ఆయ‌న వెంటే తిర‌గాలి. వెళ్లేట‌ప్పుడు వీడ్కోలు కూడా ప‌ల‌కాలి.

అయితే.. కొన్నాళ్లుగా మోడీపై విరుచుకుప‌డుతున్న కేసీఆర్‌.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా.. రాజ‌కీయాలు చేస్తున్న కేసీఆర్‌.. మోడీకి ఎదురు ప‌డ‌త‌రా!  ఆయ‌న‌కు స్వాగ‌తం చెప్త‌రా!  ఆయ‌న‌కు వీడ్కోలు పల్కుత‌రా!  అందుకే.. అనూహ్య‌మైన‌.. అవ‌స‌రాన్ని క‌ల్పించుకుని ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని  అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి ఇప్ప‌టికిప్పుడు.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ప‌లు రాష్ట్రాల్లో మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి.

దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేత‌లు .. బిజీబిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోకేసీఆర్ ఎందుకు వెళ్లారు? అంటే.. మోడీ నుంచి త‌ప్పించుకునేందుకే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) ద్విదశాబ్ది కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరు కానున్నారు. అయితే, సరిగ్గా మోడీ పర్యటన ఖరారైన సమయంలోనే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్ పెట్టేసుకున్నారు. అయితే.. 25నో.. 26నో. ఈ టూ ర్ పెట్టుకుంటే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని భావించిన కేసీఆర్ ఓ వారం ముందుగానే.. ఢిల్లీకి వెళ్లిపోయార‌న్న‌మాట‌.

ఇదే కొత్త‌కాదు!

ఇటీవల ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం దూరంగా ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేదు.  తాజాగా ప్రధాని మరోమారు రాష్ట్రానికి వస్తుండగా.. ముఖ్యమంత్రి వారం రోజుల పాటు జాతీయ స్థాయి పర్యటనకు వెళ్లడం కూడా ఇందులో భాగ‌మేన‌ని అంటున్నారు. కొన్ని నెలలుగా కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్నారు.

జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేసే ప్రక్రియలో భాగంగా పలువురు ఆర్థిక వేత్తలు, మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులతో చర్చలు జరపాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ప‌రిణామాల‌కు తోడు ధాన్యం కొనుగోలు విష‌యం ఢిల్లీకి.. హైద‌రాబాద్‌కు, కేసీఆర్‌కు మోడీకి మ‌ధ్య గ్యాప్‌ను భారీగా పెంచేసింది. కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ వచ్చినప్పటికీ..   సీఎం కేసీఆర్‌ పాల్గొనలేదు. కనీసం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికీ వెళ్లలేదు.

ఆ తర్వాత గత నెల 27న కొవిడ్‌పై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించగా.. టీఆర్ఎస్‌ ప్లీనరీ ఉండడంతో కేసీఆర్‌ హాజరు కాలేదు. కేవలం అధికారులు మాత్రమే ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ఢిల్లీలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల చీఫ్‌ జస్టి్‌సలతో రెండు రోజుల సదస్సు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కాగా.. కేసీఆర్‌ డుమ్మా కొట్టారు.

ఆ తర్వాత రాష్ట్రపతి నిలయంలో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌, హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రులకు ప్రధాని ఆధ్వర్యంలో విందు ఇచ్చారు. మోడీకి ముఖాముఖి ఎదురుపడటం ఇష్టం లేకనే కేసీఆర్‌... ఆ కార్యక్రమానికి హాజరు కాలేదన్న వార్తలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ హైదరాబాద్‌ వస్తుండటం, సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా.. కేసీఆర్ త‌లుచుకుంటే.. నెత్తినా పెట్టుకోగ‌ల‌రు.. లేక‌పోతే.. నేల‌పైన విసిరికొట్ట‌నూ గ‌ల‌రు!!