గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్ ... తోలి వ్యాక్సిన్ సిద్ధం !

Sat Nov 21 2020 22:00:28 GMT+0530 (IST)

Good News Pfizer ... First Vaccine Ready!

కరోనా మహమ్మారి తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి తీవ్రత నానాటికి పెరిగిపోతుంది. ఈ సమయంలో గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మెసెంజర్ ఆర్ ఎన్ ఏ ఆధారంగా రూపొందించిన తమ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ శుక్రవారం అప్లై చేసుకుంది. దీన్ని వచ్చే నెలలో యూఎస్ ఎఫ్డీఏ సలహా కమిటీ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8-10 మధ్య కాలంలో సమీక్ష ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. తద్వారా కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ను రూపొందించిన తొలి కంపెనీగా ఫైజర్ రికార్డ్ సాధించనున్నట్లు ఫార్మా నిపుణులు చెప్తున్నారు.ప్రపంచ దేశాలను వణికిస్తున్నకరోనా కట్టడికి పలు గ్లోబల్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. జర్మన్ కంపెనీ బయోఎన్టెక్ తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలలోనూ 95 శాతం ఫలితాలను సాధించినట్లు ఫైజర్ ఇటీవల ప్రకటించింది. మూడో దశ పరీక్షల తొలి ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ సత్ఫలితాలు సాధిస్తున్నట్లు ఫైజర్ తెలియజేసింది. యూఎస్ బెల్జియంలలో వినియోగానికి ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలను అందించగలమని ఫైజర్ బయోఎన్టెక్ తాజాగా తెలియజేశాయి.

తమ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించమంటూ యూరోపియన్ యూకే ఔషధ నియంత్రణ సంస్థలకు సైతం తాము దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర దేశాలలో నియంత్రణ సంస్థలకూ దరఖాస్తు చేయనున్నట్లు వివరించారు. అయితే ఫైజర్ తయారీ వ్యాక్సిన్ ను -80-94 సెల్షియస్ లో నిల్వ చేయవలసి ఉన్నందున కంపెనీ ఇందుకు అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ ను సైతం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు వీలుగా డ్రై ఐస్ తో కూడిన సూపర్ కూల్ స్టోరేజీ యూనిట్లను రూపొందించింది.