Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ టికెట్ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారు: పేర్ని నాని

By:  Tupaki Desk   |   14 Sep 2021 11:41 AM GMT
ఆన్ లైన్ టికెట్ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారు: పేర్ని నాని
X
ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారని ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని వివరించారు. పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.

టికెట్ రేట్లను, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన జీవో ఇచ్చామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే టిక్కెట్ల విక్రయం జరిపేలా ఆదేశాలిచ్చామన్నారు.

ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు.దీనిపై అర్ధం లేని విధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారని ఆరోపించారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.

2002 ఏడాదిలో ఈ ఆన్ లైన్ సిస్టం ద్వారా సినిమా టిక్కెట్లను అమ్మించే ప్రయత్నం చేయండని కేంద్రాన్ని కోరామని మంత్రి పేర్ని నాని తెలిపారు. పన్నుల ఎగవేత అరికట్టొచ్చని గతంలో ప్రభుత్వాలు భావించాయన్నారు. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్లను అమ్మొచ్చని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సమ్మతి తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంగీకారం తెలిపిందని వివరించారు.

ఎవరికో మేలు చేయడానికి విమర్శలు చేయడం సరికాదని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వ ఆలోచనను అర్ధం చేసుకోవాలన్నారు. నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. సినిమా హాళ్ల యాజమాన్యాలతో త్వరలో సమావేశం జరపనున్నామని తెలిపారు.

ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృతంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. జగన్ ప్రభుత్వం ఏ మంచి చేస్తోన్నా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఆన్ లైన్ విధానం మంచిదని సినీ ప్రముఖులు చాలా మంది చెబుతున్నారని.. సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ అవుతామని కోరారని మంత్రి పేర్ని నాని తెలిపారు.. ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదర్లేదని తెలిపారు. త్వరలోనే సినీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ కానున్నారని తెలిపారు.