లోకేశ్ పాదయాత్రకు అనుమతులు వచ్చాయ్.. నిబంధనలు ఇవే

Tue Jan 24 2023 11:10:32 GMT+0530 (India Standard Time)

Permissions have been received for Lokesh Padayatra.. The rules are as follows

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు.. ఆయన రాజకీయ వారసుడిగా అభివర్ణించే నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్రకు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ నెల 27 నుంచి షురూ కానున్న పాదయాత్రకు అనుమతి విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం.. ఈ అంశంపై జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావటం జరిగింది.ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వేళకు లోకేశ్ పాదయాత్రకు అనుమతులు ఇచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు (బుధవారం) వెల్డవుతుందని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేశ్ పాదయాత్రను చేపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆయన పాదయాత్ర ఉండేలా పార్టీ ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దం చేశారు. పాదయాత్ర అనుమతికి రాష్ట్ర డీజీపీకి లేఖ రాయటం.. దానికి రియాక్షన్ లేని నేపథ్యంలో ఈ నెల 20న మరోసారి లేఖ రాశారు. ఇదే అంశంపై మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతగా ఉన్న వేళలో చేపట్టిన పాదయాత్రకు ఎలాంటి నిబంధనలు ఫాలో అయ్యారో తెలిసిందే. కానీ.. తాను సీఎంగా ఉన్న వేళలో ఎవరైనా పాదయాత్ర చేస్తే.. ఎలాంటి పరిస్థితి ఉందన్నది తాజా ఎపిసోడ్ ను చూస్తే అర్థమవుతుంది.

జగన్ పాదయాత్ర చేసిన వేళలో.. కనీసం అనుమతి తీసుకోలేదని.. తమను మాత్రం పాదయాత్ర వివరాలు.. వాహనాలు ఎన్ని ఉంటాయన్న అంశాల్ని ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ వ్యవహరం అధికారుల నుంచి కోర్టు వరకు వెళ్లటంతో ఉలిక్కిపడ్డ పోలీసు ఉన్నతాధికారులు అప్పటికప్పుడు హడావుడిగా భేటీ అయి.. పచ్చజెండా ఊపేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా బోలెడన్ని నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందన్న మాటను అధికారులు స్పష్టం చేశారు.మరి.. ఈ నిబంధనల్ని జగన్ తన పాదయాత్ర వేళ ఫాలో అయ్యారా? అంటే సమాధానం లేని పరిస్థితి. లోకేశ్ పాదయాత్రల్ని నిర్వహించే ప్రాంతాలకు సంబంధించి.. ఆయా డీఎస్సీలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. అనుమతి ఇచ్చే సమయంలో ఆంక్షల్ని అమలు చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అలాంటి పరిమితుల్లో కొన్నింటి గురించి చెప్పాల్సి వస్తే..

-  జాతీయ రాష్ట్ర రహదారుల్లో బహిరంగ సభలు నిర్వహించకూడదు

-  రహదారిలో పావు వంతు స్థలంలో మాత్రమే పాదయాత్ర చేసుకోవాలి

-  ముప్పావు (3/4) వంతు స్థలాన్ని వాహనాల రాకపోకలకు వదిలేయాలి

ఈ తరహా నిబంధనల్ని తెర మీదకు తీసుకురానున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభల కోసం ప్రైవేటు స్థలాల్ని సేకరించి.. అలాంటి చోట సభలను నిర్వహించుకోవాలన్న ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేస్తున్నారు. ఏమైనా.. లోకేశ్ పాదయాత్ర వేళ.. మాత్రం ఈ తరహా ట్విస్టులు చాలానే ఉంటాయన్న మాట వినిపిస్తోంది.