తెలంగాణలో 'ఏసీడీ' విద్యుత్ వసూళ్లపై జనాల తిరుగుబాటు..

Tue Jan 24 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

People's revolt against 'ACD' electricity collection in Telangana

విద్యుత్ శాఖ అధిక బిల్లులతో జనాల నడ్డి విరుస్తోంది. ఉత్తర దక్షిణ డిస్కౌంలు తాము నష్టాల్లో ఉన్నామని చెబుతూ..  వాటిని భర్తీ చేసుకునేందుకు మీటర్లపై ఎక్కు పెట్టారు. రెక్కాడితే డొక్కాడని జీవితాలపై వేలకు వేలు బిల్లులు మోపుతున్నారు. వీటికి కట్టేందుకు కొందరు అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి. గతంలో అధిక మీటర్లపై అధిక లోడ్ కారణంగా అదనంగా వసూలు చేసిన విద్యుత్ అధికారులు ఇప్పుడు 'ఏసీడీ' పేరుతో భారం మోపుతున్నారు. 'ఏసీడీ' భారం వేలల్లోనే ఉండడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అయితే వీరికి ప్రతతిపక్షలు మద్దతు ఇవ్వడంతో జనాలు రోడ్లపైకి వస్తున్నారు. ఏసీడీ చార్జీలు కట్టమంటూ ఆందోళన చేస్తున్నారు. ఏసీడీ చార్జీలు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ విద్యుత్ శాఖ హెచ్చరిస్తోంది.విద్యుత్ శాఖలో ఏర్పడిన లోటును భర్తీ చేసుకునేందుకు మధ్య మధ్యలో ట్రూఆఫ్ చార్జీలు పెంచుతూ ఉంటాయి. ఇవి రూ.50 లోపే ఉండేవి. కానీ ఇప్పుడు డిస్కంలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగులో ఉండడంతో వాటిని సామాన్యులపై భారం మోపుతున్నాయి.

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇటీవల నివేదించిన ప్రకారం ప్రభుత్వాఫీసుల నుంచి సుమారు 20841 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ఇరిగేషన్ బకాయిలే 9268 కోట్లు ఉన్నాయి. అయితే వీటిని ప్రభుత్వం నుంచి వసూలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు.

గతంలో స్వల్ప నష్టం ఉండడంతో డెవలప్మెంట్ చార్జీల పేరుతో వసూలు చేసేది. కానీ ఇప్పుడు తీవ్ర నష్టం కారణంగా 'ఏసీడీ' పేరుతో వసూలు చేస్తున్నారు. ఇవి వెయ్యి నుంచి 5000 వరకు ఉండడం గమనార్హం.

అయితే ఈ ఏసీడీ చార్జీలకు విద్యుత్ అధికారులు కొత్త అర్థం చెబుతున్నారు. గతేడాది పన్నెండు నెలలకు వినియోగించిన విద్యుత్ ను పరిగణలోకి తీసుకొని నెలకు ఇంత అన్నట్లుగా వినియోగదారులు డిపాజిట్ చేయాలని.. దీనిని ఏసీడీ అంటారని చెబుతున్నారు. అయితే ఇవి ఒక్కక్కరికి ఒక్కోలాగా ఉండడంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. ఇక అద్దె ఇళ్లల్లో ఈ ఏసీడీ బిల్లులతో వివాదాలు ఏర్పడుతున్నాయి.

కొందరు ఏసీడీ  చార్జీలను కట్టకుండా సాధారణ బిల్లులు చెల్లిస్తున్నారు. కాని అవి కట్టకపోతే కనెక్షన్ తీసేస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏసీడీ భారం జనవరిలో వస్తే ఫిబ్రవరిలోగా కట్టేయాలని అంటున్నారు.

అయితే ఏసీడీ చార్జీలు రద్దు చేయాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. .ప్రతిపక్ష బీజేపీ వీరి ఆందోళనకుమద్దుత ఇస్తోంది. ఏసీడీ చార్జీలు రద్దయ్యే వరకు రోజూ ఆందోళన చేస్తామంటున్నారు. సామాన్యుల్లో సైతం ఒకేసారి వేల బిల్లు రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల కరెంట్ ఇందుకే ఇస్తామన్నారా..? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఆందోళనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.