Begin typing your search above and press return to search.

బీజేపీపై మండిపోతున్న జనాలు

By:  Tupaki Desk   |   4 May 2021 5:30 PM GMT
బీజేపీపై మండిపోతున్న జనాలు
X
పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన ఘర్షణలకు నిరసనగా దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలన్న బీజేపీ పిలుపుపై జనాల్లో మంటపెరిగిపోతోంది. బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తమపార్టీకి చెందిన ఐదుమంది కార్యకర్తలు చనిపోయినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. తృణమూల్ నేతల దాడుల్లోనే తమ కార్యకర్తలు మరణించినట్లు కమలనాదులు చెబుతున్నారు.

ఇదే సమయంలో తమపై బీజేపీ నేతలే దాడులు చేశారంటూ తృణమూల్ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. సరే ఎవరిపై ఎవరు దాడి చేశారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే జరిగిన ఘటనకు నిరసనగా మేనెల 5వ తేదీన దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపివ్వటమే వివాదంగా మారింది. ఒకవైపు కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమవ్వటంతో జనాలు నానా అవస్తలు పడుతున్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మహమ్మారి సంక్షోభంతో జనాలు అల్లాడిపోతున్నారు.

ఇలాంటి సమయంలో రాజకీయ కారణాలతో ధర్నాకు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపివ్వటం ఏమిటంటూ జనాలు మండిపోతున్నారు. బెంగాల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో మోడి, అమిత్ షా బహిరంగసభలు, రోడ్డుషోల్లో పాల్గొన్నారు. కరోనా విజృంభణ సమయంలో కూడా జనాల క్షేమాన్ని లెక్కచేయకుండా బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహించారంటు మోడిపై ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఇలాంటి సమయంలో ఎలాంటి నిరసనలకు దిగొద్దని కొన్ని రాష్ట్రాల్లో నిషేధం విధిస్తే బీజేపీ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా 5వ తేదీన నిరసనలకు దిగటం ఏమిటంటే జనాలు నిలదీస్తున్నారు. పైగా కోవిడ్ నిబంధనలను అనుసరించే ధర్నాలు చేస్తామని చెప్పటాన్ని మరింతగా తప్పుపడుతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ధర్నా పిలుపుపై మోడి స్పందిచకపోవటాన్ని కూడా జనాలు తప్పుపడుతున్నారు. నిరసనలు వద్దని వారించాల్సిన మోడి మౌనంగా ఉండటాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు.