Begin typing your search above and press return to search.

పెగాసస్ వివాదం: కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   13 Sep 2021 2:45 PM GMT
పెగాసస్ వివాదం: కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు
X
సుప్రీంకోర్టులో పెగాసస్ పై విచారణలో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు అన్నట్టుగా వాదన కొనసాగింది.సీజేఐ రమణ, జస్టిస్ లు సూర్యకాంత్, హిమా కోహ్లీ పెగాసస్ పిటీషన్లను విచారించారు. కేంద్రం తరుఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు.

పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ పై తగిన వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రప్రభుత్వం పాటించలేదు. పైగా గతంలో ఇచ్చిన అఫిడవిట్ సరిపోతుందని.. అందకు మించి అవసరం లేదని కేంద్రప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది.

కేంద్రప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగైతే తామే రెండు మూడు రోజుల్లో తగిన ఆదేశాలు జారీ చేస్తామని తీర్పును రిజర్వ్ చేసింది.

దేశ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్ దాఖలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధమని కేంద్రం తెలిపింది.

దేశ భద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదన్నారు. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు తమ హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటీషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏమైనా ‘నిఘా సాఫ్ట్ వేర్’ స్పైవేర్ ఉపయోగించిందా? అని సీజేఐ రమణ నిలదీశారు. స్పైవేర్ అంశంపై లోక్ సభలో ఐటీ మంత్రి వివరణ ఇచ్చారన్నారు. అయితే సీజేఐ మాత్రం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తే ప్రభుత్వ ఉద్దేశం ఏంటో తెలుస్తుందన్నారు.

అయితే కేంద్రమంత్రి ఇదివరకే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని.. సమగ్రమైన అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం సమాధానంపై సీజేఐ రమణ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేస్తామని సీజేఐ తెలిపారు.