Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి వ్యవహారం అనుమానమే

By:  Tupaki Desk   |   19 Jun 2021 11:30 AM GMT
పెద్దిరెడ్డి వ్యవహారం అనుమానమే
X
మాజీమంత్రి ఈటలరాజేందర్ బీజేపీ లో చేరటాన్ని మరో నేత పెద్దిరెడ్డి ఏమాత్రం సహించలేకపోతున్నట్లున్నారు. పదే పదే హుజూరాబాద్ ఉపఎన్నికలో తానే పోటీకి రెడీ అంటు కావాలనే ప్రకటిస్తున్నారు. ఈటల పార్టీలో చేరిన తర్వాత పెద్దిరెడ్డి అస్తిత్వానికి సమస్య వచ్చింది. పెద్దిరెడ్డేమో అప్పుడెప్పుడో రెండుసార్లు గెలిచారు. మరి ఈటలేమో నాలుగుసార్లు వరుసగా గెలిచారు. ఇపుడు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు రెడీ అంటున్నారు.

ఇద్దరి విషయాన్ని భేరీజు వేసుకుంటే ఏ పార్టీ అయినా ఈటలకే టికెట్ ఇస్తుంది. ఎందుకంటే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటం ద్వారా ఈటల బీజేపీలో చేరారు. రాజీనామా ద్వారా ఖాళీ అయిన నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే టికెట్ ఈటలకు ఇవ్వటమే న్యాయం, ధర్మం కూడా. ఈ విషయాలన్నింటినీ భేరీజు వేసుకున్న తర్వాతే పెద్దిరెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టినట్లున్నారు.

ఈటల ఉండగా తనకు టికెట్ ఇవ్వరని కూడా డిసైడ్ అయిపోయినట్లే కనబడుతోంది. అందుకనే పార్టీ మార్పుపై ప్రశ్నించినపుడు కార్యకర్తలు ఎలా చెబితే అలా నడుచుకుంటానని తెలివిగా సమాధానమిస్తున్నారు. ఏ నేతకైనా అంతిమంగా క్యాడర్, ప్రజలే కదా ఫైనల్ అంటు తన మనసులోని మాటను బయటపెట్టారు. అంటే ఈటల పోటీ చేయటం ఖాయమని తేలిపోంగానే తాను బీజేపీలో కంటిన్యు అవ్వాలా ? లేకపోతే టీఆర్ఎస్ లోకి వెళ్ళాలా ? అనేది డిసైడ్ చేసుకునేట్లున్నారు.

ఎందుకంటే ఈటల బీజేపీలో చేరిక ఫైనల్ కాగానే పెద్దిరెడ్డి చూపు టీఆర్ఎస్ వైపుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన మాటలు విన్నతర్వాత అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈటల పోటీచేస్తే పెద్దిరెడ్డి బీజేపీలో ఉండేది అనుమానమే. ఒకవేళ బీజేపీలోనే కంటిన్యు అవ్వాల్సొచ్చినా ఈటల గెలుపుకు పనిచేసేది మాత్రం అనుమానమే అనేది అర్ధమవుతోంది. ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే సామెత లాగ ఈటల బీజేపీలో చేరటమన్నది పెద్దిరెడ్డికి పెద్ద సమస్యగా మారిపోయింది.