Begin typing your search above and press return to search.

కృష్ణా జిల్లాలో ఈ న‌లుగురు ఈసారి గెల‌వ‌న‌ట్టేనా?

By:  Tupaki Desk   |   25 Sep 2022 3:09 PM GMT
కృష్ణా జిల్లాలో ఈ న‌లుగురు ఈసారి గెల‌వ‌న‌ట్టేనా?
X
త‌ర‌చూ త‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ప‌రుష వ్యాఖ్యలు చేస్తున్న నేత‌ల‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టి సారించారా? ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వీరు గెల‌వ‌కుండా వ్యూహాలు ప‌న్నుతున్నారా అంటే అవున‌నే అంటున్నారు.

ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు, గ‌న్న‌వ‌రం స్థానాలు మిన‌హాయించి మిగిలిన 14 స్థానాల‌ను వైఎస్సార్సీపీ త‌న ఖాతాలో వేసుకుంది. త‌ర్వాత గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా వైసీపీతో అంట‌కాగుతూ వ‌స్తున్నారు. అంటే వైసీపీ బ‌లం 15కి చేరుకుంది.

కాగా కృష్ణా జిల్లాలో మ‌చిలీప‌ట్నం, గుడివాడ‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, పెడ‌న ఎమ్మెల్యేలుగా ఉన్న పేర్ని నాని, కొడాలి నాని, వెలంప‌ల్లి శ్రీనివాస్‌, జోగి రమేష్ త‌దిత‌రులు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీరి విమ‌ర్శ‌లు హ‌ద్దు దాటుతున్నాయ‌ని, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం, బూతులు తిట్ట‌డం వంటివి చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుల‌ను తిట్ట‌డానికి మాత్ర‌మే వెలంప‌ల్లి, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్ ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని విమ‌ర్శలు ఉన్నాయి.

జ‌గ‌న్ మొద‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో వెలంప‌ల్లి, కొడాలి నాని, పేర్ని నానిలు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. ఈ ముగ్గురు వీరి శాఖ‌ల్లో చెప్పుకోద‌గ్గ ప‌ని ఏదైనా చేశారంటే ముందూ వెనుకా చూసుకోవాల్సిందేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వీరి ప‌ద‌వీకాలం రెండున్న‌రేళ్ల స‌మ‌యం మొత్తాన్ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబుల‌ను తిట్టిపోయ‌డానికే ధార‌పోశార‌ని చెబుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై బూతుల‌తో విరుచుకుప‌డ‌టానికి, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఈ ముగ్గురూ ఎంత పోటీప‌డ్డా ఈ ముగ్గురికి జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో జెల్ల‌కాయ చూపించేశారు.

వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు, కొడాలి నాని, పేర్ని నాని కోవ‌లోనే తిట్లు, బూతుల‌తో వీరికి పోటీగా దూసుకొచ్చేసిన పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌న‌సులో స్థానం సంపాదించారు. కేవ‌లం తిట్లతో విరుచుకుప‌డ‌ట‌మే కాకుండా చంద్ర‌బాబు ఇంటిపైకి భారీ కాన్వాయ్ దాడికి బ‌య‌లుదేరి వెళ్ల‌డం ద్వారా జోగి ర‌మేష్‌.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేశారు. దీంతో జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో జోగి ర‌మేష్ మంత్రిప‌దవి కొట్టేశారు.

కృష్ణా జిల్లాలో పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్‌, వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుల‌ను ఓడించాల‌ని అటు జ‌న‌సేన పార్టీ, ఇటు టీడీపీ కూడా కంక‌ణం క‌ట్టుకున్నాయ‌ని అంటున్నారు. ఈ న‌లుగురు నేత‌ల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించ‌డానికి వ్యూహాలు సైతం ప‌న్నుతున్నార‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ మీద ప్రేమ‌తో సొంత కులాన్ని కూడా దూషించి పేర్ని నాని కాపుల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. అంతేకాకుండా వైసీపీ బందరు ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి తీవ్ర స్థాయి పేర్ని నానిపై బ‌హిరంగంగా విరుచుకుప‌డ్డారు. బంద‌రులో వైసీపీ కార్పొరేటర్లు కొంత‌మంది కూడా పేర్ని నాని వ్య‌వ‌హార శైలిపైన గుర్రుగా ఉన్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వచ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల వ్యూహం సంగ‌తేమో కానీ సొంత పార్టీ నేత‌లే పేర్ని నానిని ఓడించ‌డం ఖాయ‌మంటున్నారు.

ఇక గుడివాడ‌లో కొడాలి నానిపై వ్య‌తిరేక‌త తీవ్ర స్థాయిలో ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌శాంత ప‌ట్ట‌ణంగా, విద్యా కేంద్రంగా ఉన్న గుడివాడ‌ను కేసినోల‌కు అడ్డాగా చేశార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై బూతుల‌తో విరుచుకుప‌డ‌టంతో కొడాలి నానిని క‌మ్మ సామాజిక‌వ‌ర్గం పూర్తిగా దూరం పెట్టింద‌ని అంటున్నారు. మ‌రోవైపు గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు ఓట‌ర్లు 35 వేల‌కు పైగా ఉన్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై నాని ప్ర‌తిసారి నోరు పారేసుకుంటుండంతో ఈసారి నానికి త‌మ త‌డాఖా ఏంటో చూపించాల‌ని కాపు సామాజిక‌వ‌ర్గం, వివిధ కులాల్లోని ప‌వ‌న్ అభిమానులు కంక‌ణం క‌ట్టుకున్నార‌ని అంటున్నారు. ఏ విధంగా చూసినా ఇక కొడాలి నానికి గుడివాడ‌లో రాజ‌కీయ స‌మాధే అనే అభిప్రాయాలు బ‌హిరంగంగానే వినిపిస్తున్నాయి.

ఇక పెడ‌న‌లో జోగి ర‌మేష్ కు సొంత పార్టీలోనే.. అందులోనూ సొంత కులంలోనే అస‌మ్మ‌తి ఉందని అంటున్నారు. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా ఉన్న ఉప్పాల హారికతో జోగి ర‌మేష్‌కు విభేదాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ పెడ‌న టూరులో ఇవి బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. ఉప్పాల హారిక మామ ఉప్పాల రాంప్ర‌సాద్ 2014లో పెడ‌న నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఆయ‌న‌కు వైసీపీ సీటు ఇవ్వ‌లేదు. అంతేకాకుండా జోగి ర‌మేష్ 2014లో మైల‌వ‌రం నుంచి పోటీ చేసి దేవినేని ఉమా చేతిలో చిత్త‌య్యారు.

అసెంబ్లీ సాక్షిగానే ప్ర‌తిపక్ష నేత‌ల‌ను వెధ‌వ‌ల‌ని దూషించ‌డం, చంద్ర‌బాబు ఇంటిపైకి భారీ కాన్వాయ్‌తో దాడికెళ్ల‌డం, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం, ఓవైపు సొంత పార్టీలోనే, సొంత కులంలోనే అస‌మ్మ‌తి జోగి ర‌మేష్‌కు ప్ర‌తిబంధ‌కాలుగా మారుతున్నాయ‌ని అంటున్నారు. పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కాపు ఓట‌ర్ల జ‌నాభా 40 వేల‌కు పైగా ఉంది. క‌మ్మ ఓట‌ర్లు కూడా చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఏ విధంగా చూసినా జోగి ర‌మేష్ ఈసారి ఇక్క‌డ నుంచి గెలిచే సూచ‌న‌లు లేవ‌ని అంటున్నారు.

ఇక విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు దేవ‌దాయ‌శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు అన్నీ వివాదాలేన‌ని చెబుతున్నారు. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ గుడిలో అక్ర‌మాలు, సింహాచలం భూముల అన్యాక్రాంతం ఇలా ప‌లు వివాదాల‌కు తోడు ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు ఆయ‌న‌కు చేటు చేస్తాయ‌ని అంటున్నారు. అందులోనూ విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన అభ్య‌ర్థి పోతిన మ‌హేష్ గ‌ట్టి అభ్య‌ర్థి అని చెబుతున్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో పోతిన మ‌హేష్ సామాజిక‌వ‌ర్గం న‌గ‌రాలు 40 వేల‌కు పైగా ఉన్నారు. కాపుల సంఖ్య కూడా అత్య‌ధిక‌మే. ఈ నేప‌థ్యంలో వెలంప‌ల్లి ఈసారి ఇక్క‌డ ఊస్టింగేన‌ని అంటున్నారు.

ఈ న‌లుగురు నేత‌ల వ్య‌వ‌హార‌శైలికి తోడు అటు టీడీపీ, ఇటు జ‌న‌సేన క‌లిసి పోటీ చేసి.. తమ ఉమ్మ‌డి అభ్య‌ర్థుల‌ను నిలిపితే అస‌లు వైసీపీ కూట‌మికి పోటీ కూడా ఇవ్వ‌లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.