Begin typing your search above and press return to search.

పవన్ తేల్చుకోవాల్సిన టైమ్ ...?

By:  Tupaki Desk   |   19 Jan 2022 11:32 AM GMT
పవన్ తేల్చుకోవాల్సిన టైమ్ ...?
X
పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ గా విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఇక ఆయనలో ఉన్న సామాజిక స్పృహ కారణంగా ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఏడేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించారు. ఆయన అప్పట్లోనే పోటీ చేసి ఉంటే ఈ పాటికి జనసేనకు ఒక షేపూ రూపూ వచ్చేవి. అయితే వైసీపీని అధికారంలోకి రానీయను అన్న ఒకే ఒక్క అజెండాతో ఆయన భేషరతుగా బీజేపీ, టీడీపీలకు మద్దతు ప్రకటించారు. ఆ విధంగా ఆ రెండు పార్టీలు అధికారంలోకి రావడానికి పవన్ భారీ రాజకీయ త్యాగమే చేశారు.

ఇక 2019 నాటికి పవన్ విడిగా పోటీ చేసి రాజకీయంగా తప్పటడుగులు వేశారు అంటారు. ఆనాడే ఆయనకు బీజేపీ నుంచి ఇన్విటేషన్ ఉంది. ఆ పార్టీతో కలిస్తే మోడీ ఇమేజ్ తో ఏపేలో ఎంతో కొంత ఉనికి చాటుకునే అవకాశం ఉండేది. కానీ ఎక్కడో యూపీలో ఉన్న బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. అలా పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

ఇక ఆ వెంటనే ఆయన బీజేపీతో చెలిమిని కలిపారు. అంతవరకూ బాగానే ఉన్నా 2024 నాటికి పవన్ ఏం చేస్తారు అన్నదే ఇపుడు చర్చ. ఏపీలో రాజకీయం చూస్తే టీడీపీకి ఆదరణ పూర్వం మాదిరిగాలేదు. చంద్రబాబు వయోభారం కారణంగా ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక లోకేష్ సామర్ద్యం మీద కూడా ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. అయితే పొత్తుల ద్వారానే ఈసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారు.

అందుకోసం ఆయన జనసేనను దువ్వుతున్నారు. వన్ సైడ్ లవ్ అని కూడా అంటున్నారు. అయితే చంద్రబాబుతో చేతులు కలిపితే పొత్తుల పార్టీగానే జనసేన మిగిలిపోతుంది అన్న భావన అయితే ఆ పార్టీలో ఉందని అంటున్నారు. అదే టైమ్ లో ఏపీలో బలమైన‌ సామాజిక వర్గానికి సీఎం పదవి ఆకాంక్ష తీరకుండానే కధ సాగిపోతుంది అన్న ఆవేదనా ఉంది.

సరిగ్గా ఇక్కడే పవన్ మీద వత్తిడి పెరుగుతోంది అంటున్నారు. ఏపీలో టీడీపీకి మద్దతు ఇస్తే చంద్రబాబే సీఎం అవుతారు. ఆయన తరువాత వారసుడిగా లోకేష్ ని సిద్ధం చేసుకుంటారు. ఒక విధంగా టీడీపీతో జట్టు కట్టడం అంటే ఆ పార్టీకి మరింత కాలం పొలిటికల్ ఆక్సిజన్ ఇచ్చినట్లే అని అంటున్నారు. దాని వల్ల జనసేన మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కి టీడీపీ ఎపుడూ ఆటంకంగానే ఉంటుంది అన్న చర్చ కూడా ఉంది.

అదే ఏపీలో టీడీపీని తగ్గిస్తేనే రాజకీయ శూన్యత అనేది ఏర్పడుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ ఆలోచన అయితే బీజేపీకి గట్టిగా ఉంది. ఎంతకాలం టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఒకటీ అరా సీట్లు సాధిస్తామన్న చర్చ కూడా కాషాయదళంలో ఉంది. అదే జనసేన‌తో కలసి ఒంటరిగా 2024లో పోటీ చేసి గణనీయమైన ఫలితాలను రాబట్టవచ్చునని ఆశిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడి వైసీపీ గెలిచినా 2029 నాటికి ఏపీలో పాగా వేసేది కచ్చితంగా తమ కూటమే అన్న ధీమాతో కూడా కమలదళం ఉందని చెబుతున్నారు.

అదెలా అంటే 2024లో టీడీపీ ఓడితే ఈసారి ఆ పార్టీలో నేతలు అంతా తమ భవిష్యత్తుని చూసుకుంటారని, వారికి సరైన ఆల్టర్నేషన్ గా బీజేపీ జనసేన కూటమి ఉంటుందని, ఆ విధంగా ఇంకా బలోపేతమై ఏపీలో అధికారంలోకి వచ్చేంత శక్తివంతంగా కూటమి మారుతుంది అని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక జనసేన గ్లామర్ కి కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఆ పార్టీ నేతలకు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారుట.

టీడీపీకి మద్దతు ఇవ్వడం అంటే రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పిదమే అవుతుంది అన్నది బీజేపీ ఆలోచన. మరి మిత్రపక్షం జనసేన మాత్రం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది అంటున్నారు. ముఖ్యంగా వైసీపీని గద్దె దించాలన్నది ఆ పార్టీ మొదటి అజెండాగా ఉంది. మరి అదే కనుక గట్టిగా నమ్మితే మాత్రం ఏపీలో జనసేన టీడీపీ పొత్తు కుదురుతుంది అంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఏపీలో 2024లో జరిగే ఎన్నికలు చాలా కీలకమైనవి. అవి అన్ని రాజకీయ పార్టీల జాతకాన్ని కూడా సమూలంగా మార్చేసేవి అంటున్నారు. అందువల్ల పవన్ తాను అటా ఇటా అన్నది తేల్చుకోవాల్సిన సమయం ఇదే అని కూడా అంటున్నారు.