Begin typing your search above and press return to search.

చెప్పుతో కొడతా నా కొడకా అన్న పవన్ నోటి నుంచే ఈ మాటలన్నీ

By:  Tupaki Desk   |   4 Dec 2022 5:41 AM GMT
చెప్పుతో కొడతా నా కొడకా అన్న పవన్ నోటి నుంచే  ఈ మాటలన్నీ
X
చెప్పు తీసి కొడతా వైసీపీ నా కొడకల్లారా.. తమాషాల్లా ఉందా కొడకల్రారా? ఇంకోసారి చెప్పు తీసుకొని పళ్లు రాలకొడతా కొడకల్లారా.. ప్యాకేజీ.. ప్యాకేజీ స్టార్ అనే సన్నాసి కొడుకులు.. వైసీపీ నా కొడుకుల్ని చెప్పు తీసి కొడతా.. అటు తిప్పి ఇటు తిప్పి పళ్లు రాలగొడతా నా కొడకల్లార్రా’ అంటూ ఆవేశంగా కాలికి ఉన్న చెప్పును తీసి చూపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలకు చాలామంది చాలా రకాలుగా రియాక్టు అయ్యారు. అదేంటండి.. ఆ మాత్రం మర్యాద లేకుండా మాట్లాడటమా? అంటూ బుద్ధజీవులుగా చెప్పుకునే మేధావులకు సైతం పవన్ మాటలు తప్పుగానే అనిపించాయి. అంతే తప్పించి.. ఏళ్లకు ఏళ్లుగా వ్యక్తిత్వ హనాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ.. సహనానికి పరీక్ష పెట్టిన తీరు వారికి గుర్తుకు రాలేదు.

కొందరు నేతల మీద వల్లమాలిన అభిమానాన్ని ప్రదర్శించటం.. వారు అనే తప్పుడు మాటల్ని సైతం వారి సమర్థతకు.. నాయకత్వ తీరుకు నిదర్శనంగా.. రాజకీయం అన్న తర్వాత ఆ మాత్రం ఉండదా? అన్నట్లుగా మాటల్ని సాగతీసే బ్యాచ్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చే మాటలు మాత్రం కర్ణ కఠోరంగా వినిపిస్తాయే తప్పించి.. ఆయన ఆవేశం వెనుక ఆవేదన మాత్రం అస్సలు గుర్తించరు. అవసరమైతే చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా అంటూ ఘీంకరించే పవన్ కల్యాణ్ లో మరో వ్యక్తి ఉన్నారన్న విషయాన్ని కన్వినీయంట్ గా మర్చిపోయే చాలామందికి తానేమిటో.. తన మాటల సత్తా ఏమిటో తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా పవన్ చాటి చెప్పారు.

హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. స్టూడెంట్స్ సమావేశంలో పాల్గొన్న పవన్ ప్రసంగించారు. దాదాపు 35 నిమిషాలకు పైనే ఆయన ప్రసంగం సాగింది. ఇంగ్లిషులో మాట్లాడిన ఆయన మాటల్ని విన్నప్పుడు.. నిలువెత్తు నిజాయితీ కలిగిన ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంది. అంతేకాదు.. మిలీనియం తరం వారు కోరుకునే నాయకుడికి నిలువెత్తు నిదర్శనమన్నట్లుగా ఆయన తీరు ఉంది. పెద్దగా చదువు సంధ్యలు లేకున్నా.. పట్టాలు లేకున్నా.. సమాజం మీద తనకున్న అనురక్తి.. చుట్టూ ఉన్న ప్రజల మీద ఉన్న మమకారం.. వారి బతుకుల్లో రావాల్సిన మార్పు మీద ఉన్న అవగాహన ఉన్న నేతగా ఆయన మాటలు ఉన్నాయి.

సమకాలీన రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన విజన్.. నిజాయితీ ఎంతన్నది పవన్ తాజా ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది. రాజకీయాల్లో తానో విఫల నాయకుడన్న మాటను నిజాయితీగా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేందుకు పవన్ వెనుకాకడకపోవటం ఒక ఎత్తు అయితే.. ఆ మాట చెప్పేంత ధైర్యం ఇవాల్టిరోజుల్లో ఎంత మందికి ఉందన్నది ప్రశ్న. అన్నింటికి మించి తాను ఫెయిల్ అయినా గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని.. అందుకోసం శ్రమిస్తానన్న విషయాన్ని ఆయన చెప్పిన తీరు చూస్తే.. పవన్ మీద అభిమానం.. గౌరవం మరింత పెరగక మానదు.

పవన్ అంటే ఏమిటన్న విషయాన్ని తెలియజేసే ఆయన ప్రసంగం మరింత మందికి చేరాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన ప్రసంగ పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాం.

- "భారతదేశ సమగ్రాభివృద్ధికి చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ పాత్ర కీలకమని మీ విజయాలు జాతి పురోభివృద్ధికి దోహదం చేస్తాయి. మోతీలాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్ చైర్మన్‌ అండ్‌ మేనిజింగ్‌ డైరెక్టర్‌ మోతీలాల్‌ ఓశ్వాల్‌ మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక తెలివితేటలుగల వ్వక్తి ముందుగా చేసే పని.. ఒక తెలివితక్కువ మనిషి చివరిగా చేస్తాడు. తెలివితేటలు కలిగిన వ్యక్తి భవిష్యత్తును ముందే ఊహించే శక్తి కలిగి ఉంటారని అంటారు.

- నాకు ఎప్పటినుంచో ఒక సందేహం ఉండేది. ఎందుకు కొద్దిమంది మాత్రమే విజయాలను అందుకొంటున్నారు? మిగతా వారు ఎందుకు సాధించలేకపోతున్నారని? నేను ఎంత వరకూ విజయం సాధించానో నాకు తెలియదు. కానీ సినిమాల్లో నటించడం నేను జీవించేందుకు మాత్రమే. కానీ.. రాజకీయాలు మాత్రం నా దేశానికి... నా జాతి కోసమే.

- చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని. విజయం కోసం ఎదురు చూసే వ్యక్తులు తప్పనిసరిగా కామ, క్రోధ, మదమాత్సర్యాలను అధిగమించాలి. ఇక రెండోది... మహాత్మా గాంధీ మొదలు అందరూ అచరించిన విధంగా... పని చేయకుండా వచ్చే సంపద, మనస్సాక్షి లేని సంతోషం, వ్యక్తిత్వం లేని జ్ఞానం, నీతి లేని వాణిజ్యం, మానవత్వం లేని శాస్త్రం, త్యాగం ఎరుగని భక్తి ఎన్నటికీ విజయతీరాలకు చేర్చలేవు. కాబట్టి, ఇవే నా ప్రాధమిక ఆలోచనా సరళి.. జీవన విధానం. వీటిని సాధించటం అంత తేలిక కానప్పటికీ నేను దీన్ని సాధించేందుకు కృషి చేస్తూనే ఉంటా.

- సినిమా ఎప్పుడూ నేను కోరుకున్నది కాదు. నా ఆలోచనలు, ఆశయాలు వేరేగ ఉంటాయి. సీఏ విధ్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ జీవితంలో విజయాలు సాధించాలి. మీ వ్యక్తిగత విజయాలు జాతికి సంపదగా భావించండి. నా మొదటి సినియా అపజయం తర్వాత నేనెప్పుడూ నిరుత్సాహపడలేదు. కానీ నా విజయాల గ్రాఫ్‌ ఏడవ సినిమా తర్వాతే పెరిగింది.

- మీరు దాదాపు ఒకటిన్నర బిలియన్ల ప్రజలతో పోటీపడాల్సి ఉంది కాబట్టి మీ ముందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో విజయశిఖరాలను అధిరోహించాలి. మీరు కలగన్న అవకాశమే రావాలని ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

- విజయాలు.. అపజయాలు సర్వసాధారణం. కఠిన, ప్రతికూల పరిస్థితులే మిమ్మల్ని మరింత రాటుతేలేలా చేస్తాయని మరిచిపోవద్దు. ఈ పరిస్థితులే మీకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు మిమ్మల్ని తయారు చేస్తాయి. నేను నా జీవితంలో ఆరేడేళ్లపాటు అపజయాలనే చవి చూశాను. ఆ తర్వాతే "గబ్బర్‌ సింగ్‌" సినిమా విజయం దక్కింది.

- మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమంటే.. మీకు వచ్చిన విజయం వెనక వేల మంది కృషి ఉంటుందని మరిచిపోవద్దు. వారికి మీ ధన్యవాదాలు తెలపడం మరవొద్దు. అది తల్లిదండ్రులు కావచ్చు ఇంకెవరైనా కావొచ్చు. విజయం సాధించాలనుకునే ప్రతి వ్యక్తికి ఈ ధోరణి చాలా అవసరం. అపజయాలను, విజయాలను సమానంగా స్వీకరించాలి.

- నేను రాజకీయంగా విఫలమైన వ్యక్తిగానే భావిస్తాను. కానీ.. ఎప్పటికీ నేను ఓడిపోయినట్టుగా భావించలేదు. ఒక అపజయంకూడా సగం విజయమనే భావనను నింపుకున్నాను. నేను కనీసం ప్రయత్నం చేశానని అనుకొంటాను. మీ అందరికీ నా విన్నపం ఒక్కటే... అపజయం ఎదురైనప్పుడు బాధ పడొద్దు. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.

- నేను రాజకీయాల్లోకి రాక ముందు కామన్‌మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రారంభించా. కానీ మార్పు ఒక్క రోజులో రాదని తెలుసుకోవాలి. ప్రజలలో మార్పు తీసుకురావడం అంత సులభం కాదు. చాలామంది జనాలకు తక్షణ విజయాలు కావాలి.. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడీల్స్ మాదిరి.

- మార్పు సాధించాలంటే ఓపిక, సహనం ఉండాలి. ఇది సాధించాలంటే దశాబ్దాలు పట్టవచ్చు. ప్రస్తుతం నా మిషన్‌ యువతను శక్తివంతులుగా తీర్చిదిద్దటమే. రాజకీయ వ్యవస్థను తిట్టుకుంటూ గడిపే బదులు, దీన్ని మార్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయడం అవసరం.

- నేటి యువతకు బలమైన ఆలోచనలతోపాటు బలమైన దేహధారుఢ్యం కూడా అవసరమే.. స్వామీ వివేకానంద చెప్పినట్టు... వంద మంది బలమైన యువకులు ఉంటే మార్పు తీసుకురావడం తేలికే.. నేటి యువతరానికి విద్యతోపాటు కండబలం కూడా అవసరమే.. అందుకు మార్షల్‌ అర్ట్స్ లో శిక్షణ పొందవచ్చు. ఇదేదో పక్కవాణ్ని కొట్టడానికి కాదు.. మన బలాన్ని... భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కోసం ఇవి అవసరం.

- స్వామీ వివేకానంద, భగత్‌ సింగ్‌ లాంటి వారిని రియల్‌ హీరోలుగా భావిస్తాను. నేను ఎక్కువ అభిమానించే వ్యక్తుల్లో వనజీవి రామయ్య.. ఎవరి కోసమో ఎదురు చూడకుండా లక్షల మొక్కలను నాటి పర్యావరణాన్ని, మన భూమిని కాపాడేందుకు నిరంతరం కృషి చేశారు.

- అలాగే ఒకే వ్యక్తి.. కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్‌ ముంపుకు గురయ్యినప్పుడు వందల మంది ప్రాణాలను కాపాడారు. ఇలాంటి వ్యక్తులే నాకు రియల్‌ హీరోలు. నేను ఎల్లప్పుడూ ఆదాయం సమకూర్చుకొనే జీవితాన్ని కోరుకోను. అనుభూతితో కూడిన జీవితాన్నే కోరుకుంటాను. నేను డబ్బు కోసం అర్రులు చాచను. నన్ను ఎవరైనా విజయం సాధించే మనిషిగా ఉంటావా..? లేదంటే.. విలువలు కాపాడే వ్యక్తిగా జీవిస్తావా? అంటే రెండూ కోరుకొంటాననే చెబుతాను.

- సీఏ చదువుతున్న విద్యార్థులూ... మీరు కాకపోతే ఎవరు జీవితంలో విజయం సాధిస్తారు చెప్పండి? మీరందరూ 2 వేల సంవత్సరం తర్వాతే జన్మించి ఉంటారు... మీ పెద్దవాళ్లు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినా కానీ వారి మాటలు తప్పు అని మీరు నిరూపించాలి. అలాగే.. గుడ్డిగా ఎవరినీ అనుసరించవద్దు.

- మీకు మీరే రోల్ మోడల్‌ గా ఎదగటానికి కృషి చేయాలి. మీలో అంతర్గతంగా ఉన్న మీ టాలెంట్‌ను వెలికితీయండి. వాటిని బేరీజు వేసుకొని విజయతీరాలను చేరాలని ఆకాంక్షస్తున్నాను. మీ వ్యక్తిగత విజయాలే జాతికి సంపద. మీరు విజయం సాధించడం ద్వారా మీరు జాతి అభివృద్ధికి కృషి చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. మీరు నా మాటల్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. నా మాటల్ని వినండి. వాటిల్లో మీకు మంచిగా అనిపించినవి మాత్రమే తీసుకోండి. మిగిలినవి వదిలేయండి. మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా.